LOADING...
Black Moon: ఆగస్టులో అరుదైన 'బ్లాక్ మూన్'.. కనపడనున్న 1 లక్షకు పైగా నక్షత్రాలు
ఆగస్టులో అరుదైన 'బ్లాక్ మూన్'.. కనపడనున్న 1 లక్షకు పైగా నక్షత్రాలు

Black Moon: ఆగస్టులో అరుదైన 'బ్లాక్ మూన్'.. కనపడనున్న 1 లక్షకు పైగా నక్షత్రాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆగస్టు రెండో భాగంలో ఆకాశ వీక్షకులకు ఒక అరుదైన ఖగోళ ఘట్టం దర్శనమివ్వబోతోంది. ఈ నెల 22-23 తేదీల్లో 'బ్లాక్ మూన్' (ఒక ప్రత్యేకమైన నూతన చంద్రుడు) ఏర్పడనుంది. చంద్రుని కాంతి లేని ఆ గాఢాంధకార రాత్రుల్లో ఆకాశం విశాలమైన నల్ల కాన్వాస్‌లా కనిపించి, నక్షత్ర సమూహాలు అద్భుతంగా మెరుస్తాయి. వాటిలో ముఖ్యంగా గ్రేట్ హెర్క్యులెస్ క్లస్టర్, హయడ్స్, ప్లీయడ్స్ సమూహాలు స్పష్టంగా చూడగలుగుతారు.

క్లస్టర్ వర్గీకరణ 

నక్షత్ర సమూహాలు అంటే ఏమిటి? 

ఒకే సమయంలో పుట్టిన, పరస్పర గరవాకర్షణతో కలసి ఉన్న నక్షత్రాలను సమూహాలు అంటారు. వీటిని రెండు రకాలుగా విభజిస్తారు. ఓపెన్ క్లస్టర్స్, గ్లోబ్యులర్ క్లస్టర్స్. ఓపెన్ క్లస్టర్స్‌లో హయడ్స్, ప్లీయడ్స్ ఉంటాయి. ఇవి కొత్తగా పుట్టిన నక్షత్రాలు కావడంతో కొంచెం సడలిన ఆకారంలో, ఆకాశ గంగ డిస్క్‌లో కనిపిస్తాయి. కాలక్రమంలో ఇతర నక్షత్రాల ప్రభావంతో ఇవి విడిపోతాయి. గ్లోబ్యులర్ క్లస్టర్స్‌లో గ్రేట్ హెర్క్యులెస్ క్లస్టర్ ఉంది. ఇవి చాలా పురాతన నక్షత్రాలతో గోళాకారంగా గట్టిగా కుదిరి, గెలాక్సీ చుట్టూ పరిభ్రమిస్తుంటాయి.

క్లస్టర్ వివరాలు 

గ్రేట్ హెర్క్యులెస్ క్లస్టర్ 

ఇది మెస్సియర్ 13 అని కూడా పిలుస్తారు. హెర్క్యులెస్ నక్షత్రరాశిలో, భూమికి 22,000-25,000 లైట్‌ ఇయర్స్ దూరంలో ఉంది. లక్షల్లో నక్షత్రాలు దగ్గర దగ్గరగా గట్టిగా ఉన్న ఈ సమూహం, ఉత్తర ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన వాటిలో ఒకటి. దీన్ని కనుగొనడానికి హెర్క్యులెస్ నక్షత్రరాశిలో కనిపించే వజ్రాకార 'కీస్టోన్' ఆకారాన్ని గుర్తించి, జీటా హెర్క్యులిస్, ఈటా హెర్క్యులిస్ నక్షత్రాల మధ్య బైనాక్యులర్స్‌తో చూడాలి.

క్లస్టర్ ముఖ్యాంశాలు 

హయడ్స్, ప్లీయడ్స్ 

హయడ్స్ భూమికి అత్యంత దగ్గరగా ఉన్న ఓపెన్ క్లస్టర్. ఇది సుమారు 153 లైట్‌ ఇయర్స్ దూరంలో వృషభ నక్షత్రరాశిలో ఉంది. దీని నక్షత్రాలు పక్కకు తిరిగిన 'V' ఆకారంలో ఉండి, ఎద్దు ముఖాన్ని సూచిస్తాయి. ప్లీయడ్స్ లేదా 'సప్తమాతృకలు' మరో ప్రసిద్ధ సమూహం. ఇది కూడా వృషభ రాశిలోనే ఉంది. ఇందులో వెయ్యికి పైగా చిన్న వయసు, వేడిగా మెరిసే నక్షత్రాలు ఉన్నప్పటికీ, కంటికి లేదా బైనాక్యులర్స్‌కి ఎక్కువగా ఏడు మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే దీనిని 'సప్తమాతృకలు' అని పిలుస్తారు.

స్టార్‌గాజింగ్ సలహా 

నక్షత్ర సమూహాలను చూడడానికి చిట్కాలు 

నిపుణుల సలహా ప్రకారం, ముందుగా కనీసం 30 నిమిషాలు చీకటికి అలవాటు పడాలి. ఆ తర్వాత 'అవర్టెడ్ విజన్' అనే పద్ధతి ఉపయోగిస్తే బాగుంటుంది. అంటే నక్షత్రాన్ని నేరుగా కాకుండా పక్క వైపు చూసేటప్పుడు మరింత స్పష్టంగా కాంతి పడుతుంది. సాధారణ 10x50 బైనాక్యులర్స్‌తోనే ఈ సమూహాలను స్పష్టంగా చూడొచ్చు. అంతకంటే ఆరు అంగుళాల లేదా పెద్ద టెలిస్కోప్ ఉంటే మరింత అద్భుతమైన, వివరమైన దృశ్యం లభిస్తుంది.