Grok AI: గ్రోక్ చాట్‌బాట్‌పై అశ్లీల చిత్రాల ఆరోపణలు.. మస్క్ సంస్థపై రచయిత్రి దావా
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ ఆధారిత 'గ్రోక్' చాట్‌బాట్ (Grok AI chatbot) అసభ్య చిత్రాలను రూపొందిస్తోందన్న ఆరోపణలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి. తాజాగా అమెరికా రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ కూడా ఈ వివాదంలోకి వచ్చారు. గ్రోక్ ద్వారా కొందరు యూజర్లు తన అసభ్య, అభ్యంతరకర చిత్రాలను సృష్టించారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌ఏఐ (xAI)పై న్యాయస్థానంలో దావా కూడా వేశారు. గతంలో తన బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి అంటూ ఆష్లీ చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. గ్రోక్ ద్వారా తన అనుమతి లేకుండానే డజన్ల సంఖ్యలో అసభ్య చిత్రాలు రూపొందించబడ్డాయని ఆష్లీ పేర్కొన్నారు.
Details
ఇప్పటివరకూ స్పందించని ఎక్స్‌ఏఐ
ఈ అంశాన్ని ఇప్పటికే సంస్థ దృష్టికి తీసుకెళ్లానని, అయినప్పటికీ ఆ తర్వాత కూడా ఇలాంటి చిత్రాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆమె వాపోయారు. దీంతో న్యూయార్క్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆష్లీ.. ఎక్స్‌ఏఐపై కఠిన చర్యలు తీసుకోవాలని, తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై ఎక్స్‌ఏఐ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. ఇదిలా ఉండగా, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై కూడా ఆష్లీ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఇద్దరికి పుట్టిన చిన్నారికి తండ్రిగా తన పేరు బయటకు రాకుండా చూసుకోవాలని మస్క్ తనను కోరినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Details
15 మిలియన్ డాలర్లు ఆఫర్ చేశారు
ఆ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు 15 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు కూడా ఆమె అప్పట్లో తెలిపారు. మరోవైపు మహిళలు, చిన్నారుల అసభ్య చిత్రాలను గ్రోక్ సృష్టిస్తోందని భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండోనేసియా, మలేసియా ఇప్పటికే గ్రోక్ వినియోగంపై ఆంక్షలు విధించగా, బ్రిటన్ సహా పలు యూరప్ దేశాల నుంచి కూడా ఎక్స్‌పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలకు దిగిన ఎక్స్ సంస్థ.. గ్రోక్ సాయంతో వ్యక్తుల ఫొటోలను ఇబ్బందికరంగా మార్చే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించింది.