Loading...
BepiColombo spacecraft : ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో వ్యోమనౌక
ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో వ్యోమనౌక

BepiColombo spacecraft : ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో వ్యోమనౌక

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎనిమిదేళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం తర్వాత బెపికొలంబో వ్యోమనౌక బుధ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే ఈ గ్రహం గురించి ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు అంతుచిక్కని అనేక విషయాలను ఈ వ్యోమనౌక వెలుగులోకి తీసుకురానుంది. బెపికొలంబో అనేది రెండు రోబోటిక్ వ్యోమనౌకలతో కూడిన అంతరిక్ష ప్రాజెక్టు. వీటిలో ఒకదాన్ని ఐరోపా అంతరిక్ష సంస్థ, మరొకదాన్ని జపాన్ రూపొందించాయి. వచ్చే నెలలో ఈ రెండు వ్యోమనౌకలు విడిపోనున్నాయి. అనంతరం బుధుడి ఉపరితలం నుంచి వేర్వేరు ఎత్తుల్లో పరిభ్రమిస్తూ పరిశోధనలు చేపట్టనున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 200 కోట్ల డాలర్లు ఖర్చు చేశారు.

వివరాలు 

బుధుడిని చేరిన మూడో వ్యోమనౌకగా బెపికొలంబో

బుధుడి కక్ష్యలోకి ప్రవేశించేలా బెపికొలంబోలోని రాకెట్లను శనివారం మండించారు.

దీంతో వ్యోమనౌక వేగం తగ్గి, బుధుడి గురుత్వాకర్షణ పరిధిలోకి వెళ్లింది.

అయితే వ్యోమనౌక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిందని నిర్ధారించడానికి జర్మనీలోని ఫ్లైట్ కంట్రోల్ కేంద్రంలోని సిబ్బందికి కొన్ని గంటల సమయం పట్టింది.

ఈ విషయం తెలిసే వరకు శాస్త్రవేత్తలు ఉత్కంఠగా ఎదురుచూశారు.

బుధుడిని సందర్శించిన మూడో వ్యోమనౌకగా బెపికొలంబో గుర్తింపు పొందనుంది. గత పదేళ్లలో ఈ గ్రహాన్ని చేరుకున్న తొలి అంతరిక్ష నౌక కూడా ఇదే కావడం విశేషం.

గతంలో 1970వ దశకంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన మెరైనర్-10 వ్యోమనౌక బుధుడికి మూడుసార్లు చేరువగా వెళ్లింది.

వివరాలు 

మెరైనర్‌-10 నుంచి బెపికొలంబో వరకు.. సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం

ఆ ప్రాజెక్టులో ఇటలీకి చెందిన గణిత శాస్త్రవేత్త జుసాపె 'బెపీ' కొలంబో సభ్యుడిగా పనిచేశారు.

ఆయన సేవలను గుర్తిస్తూ తాజా అంతరిక్ష నౌకకు బెపికొలంబో అని పేరు పెట్టారు.

ఆ తర్వాత నాసా పంపిన మెసెంజర్ వ్యోమనౌక 2011లో బుధుడి కక్ష్యలోకి ప్రవేశించింది.

అయితే దానిలోని ఇంధనం పూర్తిగా అయిపోవడంతో 2015లో బుధుడి ఉపరితలాన్ని ఢీకొని ధ్వంసమైంది.

బెపికొలంబో వ్యోమనౌకను 2018లో ప్రయోగించారు. భూమి నుంచి నేరుగా బుధుడి వైపు పంపకుండా, పలు గ్రహాల చుట్టూ తిరిగేలా ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నారు.

ఈ ప్రయాణంలో ఒకసారి భూమికి, రెండుసార్లు శుక్రుడికి, ఆరుసార్లు బుధుడికి చేరువగా వెళ్లింది.

ఇలా మొత్తం వెయ్యి కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి తన గమ్యాన్ని చేరుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

తీవ్ర ఉష్ణోగ్రతల్లోనూ ఏడాదిపాటు పరిశోధనలు

ఈ పరిశోధనల్లో భాగంగా బుధుడి లోపలి,వెలుపలి అయస్కాంత క్షేత్రాల స్వభావాన్ని అధ్యయనం చేయనుంది.

అంతేకాకుండా అక్కడి పర్వత శ్రేణులు,అంతరిక్ష శిలలు ఢీకొనడం వల్ల ఏర్పడిన భారీ గుంతలు, అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా ఏర్పడిన మైదానాల గురించి వివరాలు సేకరించనుంది.

బుధుడిపై పరిస్థితులు వ్యోమనౌకకు పెద్ద సవాలుగా మారనున్నాయి.

ఈ గ్రహంపై ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 427డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి.

ఇంతటి తీవ్రవేడి కారణంగా వ్యోమనౌకలోని ఎలక్ట్రానిక్ పరికరాలు,ఇంజినీరింగ్ వ్యవస్థల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది.

అయినప్పటికీ ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని బెపికొలంబో సుమారు ఏడాదిపాటు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ పరిశోధనల ద్వారా బుధుడి నిర్మాణం,అయస్కాంత లక్షణాలు,భౌగోళిక స్వరూపం వంటి అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT