Chandra Grahanam: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌లో గ్రహణ సమయాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వంలో నేడు (మార్చి 3) ఒక అరుదైన ఖగోళ సంఘటన ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాదిలో అత్యంత ప్రాధాన్యమైన ఘటనగా భావిస్తున్న సంపూర్ణ చంద్రగ్రహణం నేడు ఖగోళ శాస్త్రవేత్తలు, ఆకాశ వీక్షకులను విశేషంగా ఆకట్టుకోనుంది. ఆకాశంలో 'బ్లడ్ మూన్' దర్శనమివ్వనుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అపూర్వ దృశ్యాన్ని సాధారణ కళ్లతో వీక్షించడమే కాకుండా, డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలతో చిత్రీకరించేందుకు ఫోటోగ్రాఫర్లు ముందుగానే సన్నద్ధమయ్యారు.
వివరాలు
'బ్లడ్ మూన్' అంటే ఏమిటి?
భూమి నీడ పూర్తిగా చంద్రుడిపై పడినప్పుడు చంద్రుడు ఎరుపు లేదా రాగి వర్ణంలో కనిపిస్తాడు. శాస్త్రీయంగా ఈ పరిణామాన్నే 'బ్లడ్ మూన్' అని అంటారు. సూర్యకాంతి భూమి వాతావరణాన్ని దాటి ప్రయాణించే సమయంలో తక్కువ తరంగదైర్ఘ్యం గల నీలి కాంతి చెదరిపోతుంది. ఎ క్కువ తరంగదైర్ఘ్యం గల ఎరుపు కాంతి మాత్రం చంద్రుడి ఉపరితలానికి చేరుతుంది. దీంతో చంద్రుడు ఎర్రటి ఛాయలో కనిపిస్తాడు. ఇది కేవలం దృశ్య ప్రభావమే తప్ప ఎటువంటి ప్రమాద సూచన కాదని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు.
వివరాలు
భారత్‌లో గ్రహణ సమయాలు
భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మంగళవారం మధ్యాహ్నం 03:20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 06:47 గంటలకు ముగియనుంది. అయితే గ్రహణ ప్రారంభ దశలు భారత్‌లో ప్రత్యక్షంగా కనిపించవు. చంద్రోదయం అనంతరం మాత్రమే మన దేశంలో వీక్షణ సాధ్యమవుతుంది. సాయంత్రం 06:26 గంటలకు చంద్రుడు ఉదయించనుండగా, 06:33 నుండి 06:40 గంటల మధ్య గ్రహణం గరిష్ట స్థాయిలో దర్శనమిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో సాయంత్రం 05:18 నుంచి రాత్రి 07:53 వరకు గ్రహణ ప్రభావం ఉండనుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో సాయంత్రం 06:20 తర్వాత చంద్రోదయ సమయంలో గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది.
వివరాలు
అంతర్జాతీయ వీక్షణ
భారత్‌తో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, రష్యా, ఇతర ఆసియా దేశాలు, అలాగే అమెరికా ఖండాల్లో కూడా ఈ గ్రహణం కనిపించనుంది. సూర్య గ్రహణంతో పోలిస్తే చంద్రగ్రహణాన్ని ప్రత్యేక కంటి రక్షణ పరికరాలు లేకుండానే నేరుగా వీక్షించవచ్చు. కాలుష్యం తక్కువగా ఉండి, తూర్పు దిశ స్పష్టంగా కనిపించే ప్రదేశాలను ఎంచుకుంటే అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. బైనాక్యులర్లు లేదా చిన్న టెలిస్కోప్ ఉపయోగిస్తే చంద్రుడి రంగు మార్పులను స్పష్టంగా గమనించవచ్చు. ప్రత్యక్షంగా చూడలేని వారి కోసం అనేక శాస్త్రీయ సంస్థలు యూట్యూబ్ ద్వారా లైవ్ ప్రసారాలను కూడా నిర్వహిస్తున్నాయి.