Boat Airdopes ProClip: ఓపెన్-ఇయర్ టెక్నాలజీతో బోట్ కొత్త ఇయర్‌బడ్స్.. ధర, ఫీచర్లు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా ఇయర్‌బడ్స్ ఉపయోగిస్తున్నప్పుడు చుట్టుపక్కల జరిగే విషయాలు వినిపించకపోవడం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది. ముఖ్యంగా రోడ్డుపై నడిచేటప్పుడు, జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు లేదా కార్యాలయాల్లో పనిచేసే సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ భారతీయ ఆడియో బ్రాండ్ బోట్ కొత్త ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చిన ఈ గ్యాడ్జెట్ ప్రస్తుతం టెక్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాలు
బోట్ ఎయిర్‌డోప్స్ ప్రోక్లిప్ విడుదల
బోట్ తాజాగా 'ఎయిర్‌డోప్స్ ప్రోక్లిప్' పేరుతో కొత్త ఇయర్‌బడ్స్‌ను ఆవిష్కరించింది. వీటి ప్రారంభ ధరను రూ.1,599గా నిర్ణయించింది. సాటిన్ వైట్, సిల్క్ గ్రే, వెల్వెట్ వైన్ రంగుల్లో ఈ ఇయర్‌బడ్స్ లభిస్తున్నాయి. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికలలో విక్రయాలు ప్రారంభమయ్యాయి.
వివరాలు
ఓపెన్-ఇయర్ డిజైన్ ప్రత్యేకత
ఈ ఇయర్‌బడ్స్‌లో ప్రధాన ఆకర్షణ ఓపెన్-ఇయర్ డిజైన్. సాధారణ ఇయర్‌బడ్స్‌ల మాదిరిగా చెవిలోపలికి వెళ్లకుండా, చెవి వెలుపలి భాగానికే అమరేలా వీటిని రూపొందించారు. దీంతో సంగీతాన్ని ఆస్వాదిస్తూనే పరిసరాల్లోని శబ్దాలను కూడా వినగలుగుతారు. ట్రాఫిక్‌లో ప్రయాణించే వారు, జాగింగ్ లేదా సైక్లింగ్ చేసే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆధునిక ఆడియో ఫీచర్లు ఎయిర్‌డోప్స్ ప్రోక్లిప్‌లో ఎయిర్ కండక్షన్ టెక్నాలజీని వినియోగించారు. 12 ఎంఎం డైనమిక్ డ్రైవర్లు ఉండటంతో మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తాయని బోట్ పేర్కొంది. అలాగే శబ్దం బయటకు తక్కువగా వెళ్లేలా ప్రత్యేక సాంకేతికతను కూడా అందించారు. ఫోన్ కాల్స్ సమయంలో స్పష్టమైన వాయిస్ కోసం ఏఐ ఆధారిత నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉంది.
వివరాలు
బ్లూటూత్ 6.0తో కనెక్టివిటీ
ఈ ఇయర్‌బడ్స్‌లో బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ అందించారు. ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ అయ్యే మల్టీ-పాయింట్ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా కల్పించారు. కంపెనీ యాప్ ద్వారా సౌండ్ సెట్టింగ్స్‌తో పాటు టచ్ కంట్రోల్స్‌ను వినియోగదారులు తమకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. తక్కువ బరువు.. నీటి చినుకుల నుంచి రక్షణ ప్రతి ఇయర్‌బడ్ బరువు కేవలం 4.6 గ్రాములే కావడంతో ఎక్కువసేపు ఉపయోగించినా అసౌకర్యం కలగదని కంపెనీ చెబుతోంది. చెమట, నీటి చినుకుల ప్రభావం నుంచి రక్షణ కల్పించేందుకు ఐపీఎక్స్4 రేటింగ్‌ను కూడా అందించింది.
వివరాలు
52 గంటల బ్యాటరీ బ్యాకప్
బ్యాటరీ పనితీరులో కూడా ఈ డివైజ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 52 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుందని బోట్ వెల్లడించింది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటంతో కొద్దిసేపు ఛార్జ్ చేసినా గంటల తరబడి వినియోగించుకోవచ్చని తెలిపింది.