LOADING...
OpenAI: ఉచిత చాట్‌జీపీటీకి బ్రేక్?.. ప్రకటనలు తీసుకొస్తున్న ఓపెన్‌ఏఐ!
ఉచిత చాట్‌జీపీటీకి బ్రేక్?.. ప్రకటనలు తీసుకొస్తున్న ఓపెన్‌ఏఐ!

OpenAI: ఉచిత చాట్‌జీపీటీకి బ్రేక్?.. ప్రకటనలు తీసుకొస్తున్న ఓపెన్‌ఏఐ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాట్‌జీపీటీని ఉచితంగా వినియోగిస్తున్న యూజర్లకు ఓపెన్‌ఏఐ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. త్వరలో చాట్‌జీపీటీలో ప్రకటనలు (Ads) కనిపించనున్నాయని సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే వెంటనే యాడ్స్ ప్రారంభం కావని, వచ్చే కొన్ని వారాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తామని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. వినియోగదారుల నుంచి ఆదాయం పొందేందుకు తీసుకున్న మరో కీలక అడుగుగా ఈ నిర్ణయాన్ని భావిస్తున్నారు. ప్రస్తుతం చాట్‌జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. వీరిలో అధిక సంఖ్యలో యూజర్లు ఉచితంగానే ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. కంపెనీ విలువ దాదాపు 500 బిలియన్ డాలర్లకు చేరినప్పటికీ, భారీ నిర్వహణ ఖర్చుల కారణంగా లాభాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు.

Details

డిజిటల్ ప్రకటనలో గూగుల్, మెటా సంస్థలు ఆధిపత్యం

ఈ నేపథ్యంలోనే కొత్త ఆదాయ మార్గాల కోసం ఓపెన్‌ఏఐ ప్రకటనల వైపు అడుగులు వేస్తోంది. ఇకపై చాట్‌జీపీటీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయంలో లేదా సమాధానం ముగిసిన తర్వాత ప్రకటనలు కనిపిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ విషయంపై ఓపెన్‌ఏఐ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో స్పందిస్తూ, యూజర్లకు వచ్చే సమాధానాల నాణ్యతలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు అనుగుణంగా అవసరమైన ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించిన ప్రకటనలు మాత్రమే చూపిస్తామని, అవి కూడా చాట్‌జీపీటీ సమాధానాల కింది భాగంలో ఉంటాయని వివరించారు. డిజిటల్ ప్రకటనల రంగంలో ఇప్పటికే గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

Details

పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్‌గా మారింది

తమ ఏఐ ఆధారిత సేవల్లో ప్రకటనలను అనుసంధానం చేసి ఆదాయం పొందుతున్నాయి. మొదట్లో లాభాపేక్ష లేకుండా ఏఐ అభివృద్ధి లక్ష్యంగా ప్రారంభమైన ఓపెన్‌ఏఐ, గత ఏడాది తన వ్యాపార నిర్మాణాన్ని మార్చుకుని పబ్లిక్ బెనిఫిట్ కార్పొరేషన్‌గా మారింది. అయితే ఈ నిర్ణయంపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత అవసరాలు, సున్నితమైన విషయాలపై సలహాల కోసం చాట్‌బాట్‌లను వినియోగించే యూజర్ల నమ్మకాన్ని ప్రకటనల కోసం ఉపయోగించుకోవడం ప్రమాదకరంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో సోషల్ మీడియా సంస్థలు ఇదే మార్గాన్ని అనుసరించడంతో ఏర్పడ్డ ప్రభావాలు అందరికీ తెలిసినవేనని వారు గుర్తుచేస్తున్నారు.

Advertisement