
IISc research: చంద్రునిపై భవన నిర్మాణం.. బ్యాక్టీరియాతో ఇటుకల అభివృద్ధి
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రునిపై శాశ్వత నిర్మాణాలు చేపట్టే పరిశోధనల్లో ఒక కీలక ముందడుగు పడింది.
జాబిల్లి ఉపరితలంపై భవనాలు నిర్మించేందుకు ఇటుకలు ఉపయోగిస్తే, అక్కడి తీవ్రమైన వేడి, చలి ప్రభావంతో అవి బీటలువారే ప్రమాదం ఉంది.
ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు విశేషంగా కృషి చేశారు.
ఇటుకల్లో పగుళ్లు ఏర్పడకుండా ఉండేందుకు బ్యాక్టీరియాను ఉపయోగించే ప్రత్యేకమైన విధానాన్ని అభివృద్ధి చేశారు.
Details
తోకచుక్కల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం
తమ పరిశోధన ఫలితాలను శాస్త్రవేత్తలు 'ఫ్రాంటియర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీస్' అనే జర్నల్‌లో ప్రచురించారు. చంద్రునిపై వాతావరణ పరిస్థితులు తీవ్రమైనవిగా ఉంటాయి.
అక్కడ ఉష్ణోగ్రత ఒకేరోజులో 121 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగి, మైనస్ 133 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతూ ఉంటుంది.
అంతేకాకుండా సౌర పవనాలు, తోకచుక్కల ప్రభావం కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో చంద్రునిపై భవన నిర్మాణానికి ఉపయోగించే ఇటుకల్లో 'స్పోరోసార్సినా పాశ్చరీ' అనే బ్యాక్టీరియాను చేర్చడం ద్వారా తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఏర్పడే పగుళ్లను నివారించవచ్చని పరిశోధకులు నిరూపించారు.
Details
100 నుంచి 175 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ తట్టుకొనే అవకాశం
ఈ ప్రక్రియలో బ్యాక్టీరియా ద్రావకాన్ని, గోరుచిక్కుడు మొక్కలతో తయారుచేసిన జిగురును, అలాగే చంద్రునిపై లభించే మట్టితో సమానమైన పదార్థాన్ని ఉపయోగించి ఇటుకలు తయారుచేశారు.
ఈ విధానంలో ఉపయోగించిన బ్యాక్టీరియా, ఇటుకల తయారీలో భాగమైన కార్బొనేట్‌ను కాల్షియం కార్బొనేట్‌గా మారుస్తుంది.
ఇది గోరుచిక్కుడు జిగురుతో సమ్మేళనం కావడం ద్వారా 100 నుంచి 175 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనూ నిలదొక్కుకునే మన్నికను ఇటుకలకు అందిస్తుంది.
ఈ కొత్త ఆవిష్కరణ చంద్రునిపై భవన నిర్మాణ అవకాశాలను విస్తృతం చేయనున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు.