Japan: అంగారకుడి ఉపగ్రహం నుంచి నమూనాల సేకరణ.. జపాన్ ప్లాన్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌కు చెందిన మార్స్ మూన్స్ ఎక్స్‌ప్లోరేషన్ (MMX) మిషన్ అంగారకుడి ఉపగ్రహమైన ఫోబోస్ నుంచి మట్టి, ఇతర పదార్థాల నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అంగారకుడి నుంచి లేదా దాని ఉపగ్రహాల నుంచి సేకరించిన నమూనాలు తొలిసారిగా భూమిపై ప్రయోగశాలలకు చేరనున్నాయి. జపాన్‌లోని తనేగషిమా అంతరిక్ష కేంద్రం నుంచి హెచ్3 రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌకను ప్రయోగించనున్నారు. సుమారు 10 నెలల ప్రయాణం తర్వాత 2027 ఆగస్టులో ఇది అంగారకుడి వద్దకు చేరుకుంటుందని అంచనా. అక్కడ దాదాపు మూడేళ్లపాటు ఫోబోస్‌ను అధ్యయనం చేసి, తిరుగు ప్రయాణంలో డీమోస్ అనే మరో ఉపగ్రహాన్ని కూడా పరిశీలించనుంది.
వివరాలు
ఫోబోస్‌పై దిగడం సవాలే!
అంగారకుడి ఉపగ్రహాల్లో పెద్దదైన ఫోబోస్ సుమారు 20 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది.
మరో ఉపగ్రహమైన డీమోస్ వెడల్పు దాదాపు 10 కిలోమీటర్లు.
ఇవి రెండూ సక్రమమైన ఆకారం లేకుండా ఉంటాయి. ఫోబోస్ ఉపరితలాన్ని పరిశీలించేందుకు MMXలో భాగంగా ఐడెఫిక్స్(IDEFIX)అనే చిన్న రోవర్‌ను పంపనున్నారు.
ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ CNES,జర్మనీ అంతరిక్ష పరిశోధనా కేంద్రం DLR సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి.
ఫోబోస్‌పై గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండటంతో రోవర్‌ను ఉపరితలంపై దించడం అంత సులభం కాదు.
అక్కడ దిగిన తర్వాత రోవర్ ఎగిరి పడకుండా,సరైన దిశలో స్థిరపడి పనిచేయడం కూడా శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగా మారనుంది.
2028 చివర్లో లేదా 2029 ప్రారంభంలో దీన్ని ఉపరితలంపైకి పంపే అవకాశం ఉంది.
వివరాలు
రెండు సిద్ధాంతాలపై పరిశోధన
ఫోబోస్, డీమోస్ ఎలా ఏర్పడ్డాయనే విషయంలో శాస్త్రవేత్తలకు ప్రధానంగా రెండు అంచనాలున్నాయి.
ఒకటి.. అంగారకుడి గురుత్వాకర్షణకు చిక్కిన గ్రహశకలాలే ఈ ఉపగ్రహాలుగా మారి ఉండొచ్చు.
రెండోది.. పురాతన కాలంలో అంగారకుడిని భారీ ఖగోళ వస్తువు ఢీకొట్టడంతో వెలువడిన పదార్థాలు కలిసి ఈ ఉపగ్రహాలు ఏర్పడి ఉండొచ్చు.
వీటిలో ఏది సరైనదో తెలుసుకోవడానికి ఈ మిషన్ సాయపడనుంది.
వివరాలు
2031లో భూమికి నమూనాలు
ఫోబోస్ ఉపరితలాన్ని కెమెరాలు, లేజర్ పరికరాలు, స్పెక్ట్రోమీటర్లతో పరిశీలించడంతోపాటు, దాని రసాయన కూర్పును కూడా విశ్లేషించనున్నారు.
నాసాకు చెందిన మెగేన్ (MEGANE) పరికరం గామా కిరణాలు, న్యూట్రాన్ల సాయంతో ఉపరితలం కింద ఉన్న పదార్థాల వివరాలను సేకరించనుంది.
రెండు ప్రత్యేక పరికరాల ద్వారా కనీసం 10 గ్రాముల నమూనాలను సేకరించడం MMX లక్ష్యం. వాటిని ప్రత్యేక క్యాప్సూల్‌లో భద్రపరిచి 2031లో ఆస్ట్రేలియాలోని వూమెరా ప్రాంతానికి తీసుకురానున్నారు.
ఈ నమూనాల పరిశోధనతో అంగారకుడి ఉపగ్రహాల పుట్టుకతోపాటు సౌర కుటుంబం తొలినాళ్ల చరిత్రపై కీలక వివరాలు తెలిసే అవకాశం ఉంది.