LOADING...
WhatsApp Web: వాట్సప్‌ వెబ్‌ యూజర్లకు సెర్ట్‌-ఇన్‌ హెచ్చరిక.. మాల్‌వేర్‌తో భారీ ముప్పు
వాట్సప్‌ వెబ్‌ యూజర్లకు సెర్ట్‌-ఇన్‌ హెచ్చరిక.. మాల్‌వేర్‌తో భారీ ముప్పు

WhatsApp Web: వాట్సప్‌ వెబ్‌ యూజర్లకు సెర్ట్‌-ఇన్‌ హెచ్చరిక.. మాల్‌వేర్‌తో భారీ ముప్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ వెబ్‌, డెస్క్‌టాప్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మాల్‌వేర్‌ దాడులు జరుగుతున్నాయని జాతీయ సైబర్‌ భద్రత పర్యవేక్షణ సంస్థ సెర్ట్‌-ఇన్‌ (CERT-In) హెచ్చరించింది. ఈ మాల్‌వేర్‌ వినియోగదారుల కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌లోకి ప్రవేశిస్తే, సైబర్‌ నేరగాళ్లు ఎలాంటి అనుమతి లేకుండానే ఆ పరికరాలపై పూర్తి నియంత్రణ సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రముఖ సైబర్‌ భద్రత సంస్థలు కాస్పెర్స్కీ, సెక్యూర్‌లిస్ట్‌ నిర్వహించిన పరిశోధనల ఆధారంగా సెర్ట్‌-ఇన్‌ ఈ హెచ్చరిక నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం, హ్యాకర్లు మొదట కొంతమంది వాట్సప్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి, ఆ ఖాతాల్లోని కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న స్నేహితులు, బంధువులు, సహోద్యోగులకు ప్రమాదకరమైన ఫైళ్లను మెసేజ్‌ల రూపంలో పంపిస్తున్నారు.

వివరాలు 

కోడింగ్‌తో రూపొందించిన ఫైళ్లను అటాచ్‌మెంట్‌లుగా పంపుతున్న హ్యాకర్లు 

సందేశాలు మనకు పరిచయమైన వ్యక్తుల ఖాతాల నుంచే రావడంతో చాలామంది వినియోగదారులు ఎలాంటి అనుమానం లేకుండా వాటిని తెరిచి చూస్తున్నారు. ఇదే హ్యాకర్లకు అవకాశంగా మారుతోంది. ఈ దాడుల్లో విజువల్‌ బేసిక్‌ స్క్రిప్ట్‌ (Visual Basic Script) కోడింగ్‌తో రూపొందించిన ఫైళ్లను అటాచ్‌మెంట్‌లుగా పంపుతున్నట్లు సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది. వినియోగదారులు ఆ ఫైళ్లను ఓపెన్‌ చేసి తమ సిస్టమ్‌లో రన్‌ చేసిన వెంటనే, హ్యాకర్లు దూరం నుంచే కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌పై నియంత్రణ సాధించగలుగుతారు. అనంతరం ఖాతాల పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్‌ వివరాలు వంటి కీలక సమాచారాన్ని దొంగిలించి ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

వివరాలు 

అనుమానాస్పద ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దు 

ఈ నేపథ్యంలో తెలియని లేదా అనుమానాస్పద ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని సెర్ట్‌-ఇన్‌ సూచించింది. పరిచయస్తుల నుంచి ఫైల్‌ వచ్చినా వెంటనే ఓపెన్‌ చేయకుండా, ముందుగా వారికి ఫోన్‌ చేసి నిజంగానే వారు పంపించారా లేదా అని ధ్రువీకరించుకోవాలని వినియోగదారులకు సూచించింది.

Advertisement