చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్: ఆ 17నిమిషాలే కీలకమంటున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తుది దశకు చేరుకుంది. చంద్రుడి మీద సురక్షితంగా దిగడానికి ల్యాండర్ మాడ్యూల్ సిద్ధమవుతోంది. అయితే చంద్రుడి మీదకు సురక్షితంగా దిగే సమయంలో చివరి 17నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో చెబుతోంది. ఇస్రో వెల్లడి చేసిన ప్రకారం బుధవారం సాయంత్రం 6:04గంటలకు ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి మీద దిగనుంది. అంటే, 5:47నిమిషాల సమయం నుంచి అత్యంత కీలక దశ మొదలు కానుందన్నమాట. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చంద్రుడి ఉపరితలం నుండి 30కిలోమీటర్ల ఎత్తు నుండి ల్యాండర్ మాడ్యూల్ సమాయత్తం అవుతుంది. 30కిలోమీటర్ల ఎత్తు నుండి చంద్రుడి మీద అడుగు పెట్టేవరకు 17నిమిషాల సమయం పట్టనుంది.
800ఎత్తులో సున్నాకు చేరనున్న మాడ్యూల్ వేగం
30కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ మాడ్యూల్ నాలుగు ఇంజన్లు మండుతాయి. ఆ తర్వాత చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ల్యాండర్ మాడ్యూల్ వేగం తగ్గుతూ ఉంటుంది. చంద్రుడికి 6.8కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో రెండు ఇంజన్లు ఆగిపోతాయి. ఇక్కడ నుండి చంద్రుడి ఉపరితలం మీద దిగడానికి 11నిమిషాల సమయం పట్టనుంది. ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్, 90డిగ్రీల కోణంలో వంపు తిరిగి నెమ్మదిగా చంద్రుడి మీదకు వెళ్తుంది. చంద్రుడికి 800మీటర్ల ఎత్తులో ఉండగా ల్యాండర్ మాడ్యూల్ వేగం సున్నాకు చేరుతుంది. ఆ తర్వాత దిగడానికి అనువైన స్థలాన్ని వెదుక్కుంటుంది. దిగడానికి సురక్షితమైన ప్రదేశం దొరకగానే రెండు ఇంజన్లను మండించుకుని చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది.