ChatGPT: చాట్‌జీపిటీలో కొత్త ఫీచర్.. ఇక బట్టలు కొనేముందే వర్చువల్‌గా ట్రై చేయొచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత సులభంగా, ఆసక్తికరంగా మార్చేలా ఓపెన్‌ఏఐ మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీలో ఇప్పుడు దుస్తులు, యాక్సెసరీలను వర్చువల్‌గా ట్రై చేసుకునే అవకాశం కల్పించింది. అంటే.. ఏదైనా దుస్తులు కొనుగోలు చేసే ముందు అవి మనపై ఎలా కనిపిస్తాయో ఫొటో ద్వారా చూసుకోవచ్చు. ఈ కొత్త ట్రై-ఆన్ ఫీచర్ అక్టోబర్ 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినట్లు ఓపెన్‌ఏఐ వెల్లడించింది.
వివరాలు
సెల్ఫీ అప్‌లోడ్ చేస్తే చాలు
చాట్‌జీపిటీలో వర్చువల్ ట్రై-ఆన్ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం.
ముందుగా యూజర్లు తమ సెల్ఫీ లేదా పూర్తి నిలువు ఫొటోను చాట్‌జీపిటీలో అప్‌లోడ్ చేయాలి.
అనంతరం షాపింగ్ ఫలితాల్లో కనిపించే దుస్తులు లేదా ఇతర వస్తువుల కింద ఉన్న 'ట్రై ఆన్' బటన్‌ను ఎంచుకోవాలి.
వెంటనే ఏఐ టెక్నాలజీ ఆ వస్తువు యూజర్ ఫొటోలో ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది. ఇక్కడ మరో సౌకర్యం కూడా ఉంది.
కేవలం మన ఫోన్‌లో ఉన్న ఫొటోలను మాత్రమే ఉపయోగించాల్సిన అవసరం లేదు.
ఇతర వెబ్‌సైట్లలో కనిపించిన దుస్తులు లేదా వస్తువుల స్క్రీన్‌షాట్‌లను కూడా అప్‌లోడ్ చేసి వర్చువల్‌గా ట్రై చేసుకోవచ్చు.
వివరాలు
కొత్త ఏఐ మోడల్‌తో మరింత సహజమైన ఫలితాలు
ఈ ట్రై-ఆన్ సదుపాయం కోసం ఓపెన్‌ఏఐ తాజాగా విడుదల చేసిన'చాట్‌జీపిటి ఇమేజెస్ 2.5' మోడల్‌ను ఉపయోగిస్తోంది.
ఈ మోడల్ ద్వారా మరింత సహజంగా కనిపించే లైటింగ్,మెరుగైన టెక్స్చర్స్‌తో చిత్రాలను వేగంగా రూపొందించవచ్చని సంస్థ తెలిపింది.
దీంతో వర్చువల్‌గా ట్రై చేసిన దుస్తులు ఫొటోలో మరింత సహజంగా కనిపించేలా ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.
ఫేవరైట్స్‌లో సేవ్ చేసుకునే అవకాశం
యూజర్లకు నచ్చిన దుస్తులు,యాక్సెసరీలతో పాటు వాటి ట్రై-ఆన్ చిత్రాలను కూడా'ఫేవరైట్స్' లైబ్రరీలో సేవ్ చేసుకునే సదుపాయం ఉంది.
దీంతో తర్వాత వాటిని సులభంగా తిరిగి చూసుకోవచ్చు.అంతేకాదు..ఒక నిర్దిష్ట స్టైల్ గురించి వివరించి అలాంటి దుస్తులను వెతకడంతో పాటు,సెలబ్రిటీల ఫొటోలను అప్‌లోడ్ చేసి వాటిని పోలిన దుస్తులను కనుగొనే అవకాశం కూడా చాట్‌జీపిటీలో కల్పించారు.
వివరాలు
మొబైల్, వెబ్‌లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి..
చాట్‌జీపిటి మొబైల్ యాప్‌తో పాటు వెబ్ వెర్షన్‌లోనూ ఈ కొత్త వర్చువల్ ట్రై-ఆన్ ఫీచర్ అందుబాటులో ఉంది.
వినియోగదారులు తమ సెట్టింగ్స్‌లోకి వెళ్లి రిఫరెన్స్ ఫొటోను ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అవసరం లేకపోతే దాన్ని తొలగించుకునే సదుపాయం కూడా ఉంది.
ఆన్‌లైన్ షాపింగ్‌లో దుస్తులు తమపై ఎలా కనిపిస్తాయో ముందుగానే తెలుసుకునే అవకాశం గతంలో గూగుల్ సెర్చ్‌లోనూ అందుబాటులో ఉండేది.
ఇప్పుడు చాట్‌జీపిటీలోనూ ఇలాంటి సదుపాయం రావడంతో ఏఐ ఆధారిత షాపింగ్ అనుభవం మరింత విస్తరించినట్లైంది.