LOADING...
OpenAI: గూగుల్‌లో చాట్‌లు కనపించడంపై వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న ఓపెన్‌ఏఐ!
గూగుల్‌లో చాట్‌లు కనపించడంపై వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న ఓపెన్‌ఏఐ!

OpenAI: గూగుల్‌లో చాట్‌లు కనపించడంపై వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న ఓపెన్‌ఏఐ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాట్‌జీపీటీలో ఇటీవల ప్రవేశపెట్టిన ఓ కొత్త ఫీచర్‌ వల్ల గూగుల్‌ సెర్చ్‌లో యూజర్ల వ్యక్తిగత చాట్‌లు ప్రత్యక్షంగా కనిపించడంతో తీవ్ర వివాదం చెలరేగింది. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఓపెన్‌ఏఐ చివరికి ఆ ఫీచర్‌ను తొలగించింది. ఈ విషయాన్ని ఓపెన్‌ఏఐ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్ డేన్ స్టుకీ X వేదికగా వెల్లడించారు. 'గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్‌లలో యూజర్ల చాట్లు కనిపించడానికి అవకాశం ఇచ్చిన ఫీచర్‌ను మేము ఇప్పుడు తొలగించాము. ఇది టెస్ట్ ఫీచర్ గా అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా యూజర్లు ఒక చాట్‌ను పబ్లిక్ చేయాలని ఎంపిక చేసుకున్న తర్వాతే అది సెర్చ్ ఇంజిన్‌కి వెళ్లేది.

Details

సెర్చ్ ఇంజిన్లతో కలిసి పనిచేస్తున్నామని స్పష్టం

అయితే అనేకమంది తాము కోరకుండా ఈ ఆప్షన్‌ను క్లిక్ చేసిన సందర్భాలు కనిపించాయని స్టుకీ తెలిపారు. ఈ ఫీచర్ వల్ల చాలా మంది అనుకోకుండా తమ వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌ చేస్తూ నష్టపోయే పరిస్థితి ఏర్పడినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పటికే గూగుల్‌లో ఇండెక్స్ అయిన చాట్‌లను తొలగించేందుకు సెర్చ్ ఇంజిన్లతో కలిసి పని చేస్తున్నామని కూడా స్పష్టం చేశారు.

Details

అసలు ఈ వివాదం ఎందుకు చెలరేగింది?

ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీలో ఒక అప్‌డేట్‌ ఇచ్చింది. దీని ద్వారా యూజర్లు తమ చాట్లు గూగుల్ వంటి సెర్చ్‌ ఇంజిన్లలో కనిపించేలా చేయొచ్చే అవకాశం ఏర్పడింది. ఇది డిఫాల్ట్‌గా కాకుండా, యూజర్లే ముందుగా ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయాల్సి ఉండేది. అయితే అనేకమంది తాము షేర్ చేసిన చాట్‌లను ఫ్రెండ్స్, ఫ్యామిలీకి పంపే క్రమంలో ఈ ఆప్షన్‌ను పొరపాటున క్లిక్ చేయడం వల్ల అవి గూగుల్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌ ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు ఈ అంశానికి మరింత ప్రాధాన్యం చేకూర్చాయి. చాలామంది చాట్‌జీపీటీతో తమ జీవితం గురించి అత్యంత వ్యక్తిగత విషయాల్ని మాట్లాడుతుంటారు.

Details

ప్రైవసీ పరిరక్షణకు దోహదపడే అవకాశం

'ఫాస్ట్ కంపెనీ' నివేదిక ప్రకారం గూగుల్‌లో దాదాపు 4,500 చాట్‌లు ఇండెక్స్ అయ్యాయి. వీటిలో కొంతమంది వ్యక్తిగత వివరాలతో.. పేర్లు, ప్రదేశాలు వంటివి వివరాలు యూజర్ల గోప్యతకు నష్టం కలిగే అవకాశముందని ఆయన అన్నారు. ఒకసారి చాట్‌ను డిలీట్ చేసినా, లేదా షేర్ లింక్‌ను తీసివేశానన్నా, అది గూగుల్‌ ఇండెక్స్‌లో ఉండే అవకాశముంది. గూగుల్ తన సెర్చ్ ఇండెక్స్‌ను అప్‌డేట్ చేసే వరకూ ఆ చాట్‌లు పబ్లిక్‌గానే కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఓపెన్‌ఏఐ తీసుకున్న తాజా నిర్ణయం ప్రైవసీ పరిరక్షణకు దోహదపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.