ఇకపై యూట్యూబ్ లో 'Go Live Together'ను ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేసే అవకాశం
గత ఏడాది నవంబర్‌లో, ఇద్దరు క్రియేటర్లు కలిసి లైవ్ చేయడానికి వీలు కల్పించే 'Go Live Together' ఫీచర్‌ను యూట్యూబ్ ప్రకటించింది. ఇప్పుడు, ఈ ఫీచర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో వచ్చింది. ఈ ఫీచర్ లో కనీసం 50 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్న క్రియేటర్లు వారితో లైవ్ చేయడానికి వేరే క్రియేటర్ ను ఆహ్వానించవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం యూట్యూబ్ మొబైల్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 'Go Live Together' ఫీచర్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే క్రియేటర్‌లను సులభంగా ఒకేసారి లైవ్ లో కనిపించేలా చేస్తుంది. ఇందులో క్రియేటర్ ఒకసారి ఒకరిని మాత్రమే హోస్ట్ చేయగలరు.అయితే హోస్ట్‌లు అదే లైవ్ లో గెస్ట్స్ ను మారుస్తూ ఉండచ్చు.
హోస్ట్ పంపే ఆహ్వాన లింకు ద్వారా గెస్ట్ లైవ్ లో చేరచ్చు
కో-స్ట్రీమింగ్ చేయడానికి, యూట్యూబ్ యాప్‌కి వెళ్లి, దిగువన ఉన్న '+' (create) బటన్‌ను నొక్కాలి. అప్పుడు పాప్-అప్ ఆప్షన్స్ లో 'Go Live Together' కనిపిస్తుంది. ఆ తర్వాత, అవసరమైన వివరాలను నమోదు చేసి, 'Done' పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇన్వైట్ లింక్‌ను గెస్ట్ కు పంపాలి. గెస్ట్ ఆ లింక్ ద్వారా జాయిన్ అయినప్పుడు, 'Add' నొక్కాలి. ఆపై 'Go Live' క్లిక్ చేయాలి. లైవ్ లో గెస్ట్ గా చేరడానికి, హోస్ట్ పంపిన లింక్‌పై క్లిక్ చేసి. లైవ్ చేయాలనుకుంటున్న ఛానెల్‌ని ఎంచుకోవాలి. ఆ తర్వాత వెయిటింగ్ రూమ్‌లో చేరడానికి 'join' నొక్కాలి. హోస్ట్ మిమ్మల్ని యాడ్ చేసినప్పుడు, లైవ్ లో చేరతారు.