LOADING...
Artemis 2: చారిత్రక యాత్ర ముగిసింది.. భూమికి సురక్షితంగా చేరుకున్న ఆర్టెమిస్‌-2
చారిత్రక యాత్ర ముగిసింది.. భూమికి సురక్షితంగా చేరుకున్న ఆర్టెమిస్‌-2

Artemis 2: చారిత్రక యాత్ర ముగిసింది.. భూమికి సురక్షితంగా చేరుకున్న ఆర్టెమిస్‌-2

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2026
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. చంద్రుడిని విజయవంతంగా చుట్టివచ్చిన ఆర్టెమిస్‌-2 మిషన్‌ భూమికి సురక్షితంగా తిరిగి చేరుకుంది. కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్‌ మహాసముద్రంలోని శాన్‌డియాగో తీరంలో వ్యోమగాములు ప్రయాణించిన ఒరాయన్‌ క్యాప్సూల్‌ విజయవంతంగా ల్యాండ్‌ అయింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5.38 గంటలకు ఈ ల్యాండింగ్‌ పూర్తికాగా, మొత్తం పది రోజుల అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసింది. భూమి నుంచి ఇప్పటివరకు మానవులు ప్రయాణించిన అత్యంత దూరమైన మిషన్‌గా ఆర్టెమిస్‌-2 కొత్త రికార్డు సృష్టించింది. చంద్రుడి వద్దకు మానవులను పంపే లక్ష్యంతో నాసా ఈ నెల 1న ఆర్టెమిస్‌-2 ప్రయోగాన్ని చేపట్టింది.

వివరాలు

పసిఫిక్‌ సముద్రంలో సేఫ్ గా ల్యాండ్‌  

ఈ మిషన్‌లో అమెరికాకు చెందిన వ్యోమగాములు రీడ్ వైస్‌మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, అలాగే కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ పాల్గొన్నారు. ఈ బృందం మొత్తం 4,06,771 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఇప్పటివరకు ఎవ్వరూ చేరని స్థాయికి వెళ్లి చరిత్ర సృష్టించింది. దీంతో అపోలో 13 మిషన్‌ రికార్డు కూడా చెదిరిపోయింది. ఈ యాత్రలో చంద్రుడి అవతలి వైపు అరుదైన దృశ్యాలను, సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వ్యోమగాములు కెమెరాల్లో బంధించారు. తిరుగు ప్రయాణంలో భూమి వాతావరణంలోకి ఒరాయన్‌ క్యాప్సూల్‌ అత్యంత వేగంతో ప్రవేశించి, అనంతరం మూడు భారీ పారాచూట్ల సహాయంతో పసిఫిక్‌ సముద్రంలో సాఫీగా ల్యాండ్‌ అయింది.

వివరాలు

వీడియోను రిలీజ్ ను చేసిన నాసా

దీనికి సంబంధించిన వీడియోలను నాసా విడుదల చేసింది. ఈ విజయంపై నాసా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "రీడ్‌, విక్టర్‌, క్రిస్టినా, జెరెమీలకు స్వాగతం. ఆర్టెమిస్‌-2 వ్యోమగాములు సురక్షితంగా పుడమికి చేరుకున్నారు. చంద్రుని చుట్టూ వారి చారిత్రక 10 రోజుల మిషన్‌ విజయవంతమైందని పేర్కొంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. ట్రూత్‌ సోషల్‌ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ, "ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది. ల్యాండింగ్‌ కూడా పరిపూర్ణంగా జరిగింది. త్వరలోనే మీ అందరినీ వైట్‌హౌస్‌లో కలుసుకోవాలని ఆశిస్తున్నా. ఇక మన తదుపరి లక్ష్యం అంగారక గ్రహమని వ్యాఖ్యానించారు.

Advertisement