E -Voting: స్మార్ట్‌ఫోన్‌తోనే ఓటు హక్కు వినియోగం.. ఇక ఇంటి నుంచే ఓటు!
ఈ వార్తాకథనం ఏంటి
ఓటు వేయాలని ఎవరికి ఉండదు? అయితే అనివార్య పరిస్థితుల వల్ల కొన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు. ఉపాధికోసం అనేక మంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.విద్యార్థులు కూడా దూర ప్రాంతాల్లోని కళాశాలల్లో చదువుకుంటూ తమ నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. వృద్ధులు,గర్భిణీలు,దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం సులభం కాదు. ఇలాంటి వర్గాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బిహార్ ఎన్నికల సంఘం ఇ-ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది.ఈ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ సహాయంతోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఓటరు నమోదు నుంచి ఓటునమోదు పూర్తయ్యే దశ వరకు మొత్తం ప్రక్రియను డిజిటల్ రూపంలోనే నిర్వహించే విధంగా వ్యవస్థను రూపొందించడం దీని ప్రత్యేకత.
వివరాలు
పూర్తి భద్రతతో వ్యవస్థ
ఇ-ఓటింగ్‌లో ఓటరును గుర్తించేందుకు ఆధార్ లింక్ విధానాన్ని కాకుండా ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు (ఎపిక్) డేటాబేస్‌ను ఉపయోగిస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్, ప్రత్యక్ష గుర్తింపు నిర్ధారణ, పరికరం స్థాయి ధృవీకరణతో పాటు బ్లాక్‌చెయిన్ ఆధారిత ఎన్‌క్రిప్షన్ విధానాలు ఇందులో భాగమై ఉన్నాయి. ఇవి అసలు ఓటరును ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడతాయి. నకిలీ ఓట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం ప్రక్రియ రహస్యంగా సాగి, ఓటు సురక్షితంగా నమోదవుతుంది. ప్రతి ఓటు ఎన్‌క్రిప్ట్ చేయబడి, బ్లాక్‌చెయిన్ సాంకేతికత ద్వారా శాశ్వతంగా రికార్డు అవుతుంది. అందువల్ల ఒకసారి నమోదైన ఓటును మార్చే అవకాశం ఉండదు. స్మార్ట్ కాంట్రాక్ట్ విధానం డిజిటల్ ఈవీఎం తరహాలో పనిచేసి ఓట్ల లెక్కింపునకు తోడ్పడుతుంది.
వివరాలు
ప్రధాన లక్ష్యం
ఎన్నికల అధికారి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్, హ్యాష్ వెరిఫికేషన్ ప్రక్రియలు పూర్తిచేసిన తరువాతే డీక్రిప్షన్ సాధ్యమవుతుంది. ఈ రక్షణ చర్యల వల్ల ఓటింగ్ ప్రారంభం నుంచి లెక్కింపు దశ వరకు ప్రతి దశ గోప్యంగా, భద్రంగా ఉంటుంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఓటు వేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ పోలింగ్ రోజున తమ నియోజకవర్గాలకు చేరుకోవడం చాలా మందికి కష్టసాధ్యమవుతోంది. ఫలితంగా ముఖ్యంగా పట్టణాల్లో ఓటింగ్ శాతం తగ్గుతోంది. ఈ పరిస్థితిని మార్చి ఓటింగ్ శాతాన్ని పెంచడమే బిహార్ ఎన్నికల సంఘం లక్ష్యం. భౌతిక పరిమితులు ప్రజాస్వామ్య ప్రక్రియకు అడ్డంకిగా మారకుండా ఉండాలన్న సంకల్పంతో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
వివరాలు
ఓటింగ్ విధానం ఇలా
మొదట ఓటరు అధికారిక యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. అవసరమైన అనుమతులను మంజూరు చేయాలి. ఓటీపీ ద్వారా మొబైల్ నంబర్‌ను ధృవీకరించుకోవాలి. అనంతరం ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు (ఎపిక్) వివరాలను నమోదు చేయాలి. లైవ్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా తన గుర్తింపును నిర్ధారించుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఓటు నమోదు చేయవచ్చు.
వివరాలు
సవాళ్లు లేకపోలేదు
ఇ-ఓటింగ్ ఆలోచన వినూత్నమైనదే అయినప్పటికీ అమలులో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వృద్ధులు, తొలిసారి ఓటు వేసేవారికి యాప్ వినియోగంపై మార్గదర్శనం అవసరం. డిజిటల్ సంతకానికి అవసరమైన డీఎస్‌సీ టోకెన్ల వినియోగం, బ్యాలెట్ల అన్‌లాక్ ప్రక్రియల కోసం రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ అవసరం. పాత ఎపిక్ ఫోటోల కారణంగా ఫేషియల్ రికగ్నిషన్‌లో లోపాలు రావచ్చు. తక్కువ వెలుతురు, లో రిజల్యూషన్ కెమెరాలు, అంతర్జాల అంతరాయాలు కూడా ధృవీకరణలో ఇబ్బందులు కలిగించవచ్చు. అయినప్పటికీ ఈ అడ్డంకులను అధిగమించేలా బిహార్ ఇ-ఓటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు.
వివరాలు
సవాళ్లు లేకపోలేదు
ఇ-ఓటింగ్ సమర్థ నిర్వహణకు పరిపాలనా స్థాయిలోనూ పూర్తి సిద్ధత అవసరం. గోప్యత, పారదర్శకత అంశాలపై ప్రారంభంలో రాజకీయ వర్గాల నుంచి సందేహాలు వ్యక్తమయ్యాయి. వాటిని నివృత్తి చేసేందుకు నమూనా ఓటింగ్ ప్రక్రియలు, పారదర్శక విధానాలను వివరించి విశ్వాసాన్ని కల్పించారు.
వివరాలు
ఓట్ల లెక్కింపులోనూ సాంకేతికత
ఏఐ ఆధారిత ఓసీఆర్ లెక్కింపు వ్యవస్థను ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో ప్రదర్శించారు. ఇది ఈవీఎం డేటాను తక్షణమే సేకరించి ధృవీకరిస్తుంది. వీడియో రికార్డులు, టైమ్ స్టాంప్ ఉన్న ఆడిట్ లాగ్స్ ద్వారా ప్రతి దశను తిరిగి పరిశీలించవచ్చు. దీంతో మానవ తప్పిదాలు తగ్గి ఫలితాలు వేగంగా వెలువడతాయి. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో బిహార్ ఇప్పటికే ఈ సాంకేతిక వ్యవస్థలను విజయవంతంగా అమలు చేసి చూపించింది.