DRDO: పినాక రాకెట్ లాంచర్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో
డీఆర్డీవో (DRDO) పినాకా రాకెట్ లాంచర్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఈ సిస్టమ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, అడ్వాన్స్‌డ్ గైడెడ్ వెపన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. పినాకా ఆయుధ వ్యవస్థలోని రేంజ్, కచ్చితత్వం, స్థిరత్వం, ఫైరింగ్ రేట్ వంటి అంశాలను పరీక్షించారు. ప్రొవిజినల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ (PSQR) ట్రయల్స్‌లో భాగంగా ఈ పరీక్షలు జరిగాయి. పినాకా లాంచర్ ద్వారా 12 రాకెట్లను ఫైర్ చేసినట్లు డీఆర్డీవో ఒక ప్రకటనలో వెల్లడించింది.
మేక్ ఇన్ ఇండియా కల
మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌కి రక్షణ శాఖ ప్రోత్సహం ఇస్తున్న క్రమంలో, పినాకా వెపన్ సిస్టమ్‌పై ఇతర దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో ఫ్రాన్స్ పినాకా మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ పై ఆసక్తి కనబరుస్తోంది. అమెరికా హిమార్స్ సిస్టమ్‌తో పోల్చదగ్గ సామర్థ్యాన్ని కలిగి ఉన్న పినాకా, భారత రక్షణ రంగ ఉత్పత్తుల్లో ఎగుమతుల పరంగా రికార్డు సృష్టించనుంది. ఇప్పటికే ఆర్మేనియా ఈ వెపన్ సిస్టమ్‌ను ఆర్డర్ చేసింది. ఫ్రాన్స్ కూడా తమ ఆర్మీ బలోపేతానికి ఈ వ్యవస్థపై ఆసక్తిగా ఉందని తెలిపింది. మరికొన్ని వారాల్లో పినాకా వ్యవస్థను ఫ్రాన్స్ పరీక్షించనున్నట్లు సమాచారం.
పినాకా అనే పేరు వెనుక..
శివుడి విల్లును 'పినాకం' అని పిలుస్తారు. అదే పేరుతో ఈ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. రష్యన్ గ్రాడ్ బీఎం-12 రాకెట్ లాంచర్‌కు బదులుగా భారత ఆర్మీ కోసం ఈ సిస్టమ్‌ను రూపొందించారు. 1999లో కార్గిల్ యుద్ధంలో పినాకాను ఉపయోగించారు. వ్యూహాత్మక ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న పాకిస్థాన్ స్థావరాలను పినాకా సిస్టమ్ ద్వారా ధ్వంసం చేశారు.
సాంకేతిక విశేషాలు
ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE) పినాకా రాకెట్ సిస్టమ్‌ను రూపొందించింది. ఈ మల్టీ బారెల్ రాకెట్ లాంచర్‌లో రెండు పాడ్‌లు ఉంటాయి. ప్రతి పాడ్‌లో ఆరేసి రాకెట్లు నింపుతారు. కేవలం 44 సెకన్లలో మొత్తం 12 రాకెట్లను ఫైర్ చేయగలదు. ఈ సిస్టమ్ 700x500 మీటర్ల ప్రాంతాన్ని ధ్వంసం చేయగలదు. ఒక బ్యాటరీ మొత్తం 72 రాకెట్లను ఫైర్ చేయగలదు.