Page Loader
Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక
'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక

Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ ప్రపంచంలో సంచలన ఫిగర్ అయిన బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి మానవాళి భవిష్యత్తుపై కీలక హెచ్చరికలు చేశారు. భూమిపై జీవితం శాశ్వతం కాదని, రాబోయే రోజుల్లో మనుగడకు తీవ్రమైన ముప్పులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. మానవాళి బతికే మార్గం, భవిష్యత్తు కోసం సురక్షిత స్థలంగా అంగారక గ్రహాన్ని అభివృద్ధి చేయడం తప్ప మరో దారి లేదని స్పష్టం చేశారు. స్పేస్ ఎక్స్‌ సంస్థ అంతర్గతంగా నిర్వహించిన ఓ 42 నిమిషాల చర్చా కార్యక్రమాన్ని 'ఎక్స్‌'లో (మాజీ ట్విట్టర్) పోస్ట్ చేసిన మస్క్, భూమి భవిష్యత్తు ప్రశ్నార్థకమని, మూడో ప్రపంచ యుద్ధం లాంటి విపత్తుల నుంచి తప్పించుకునేందుకు మానవులెవరైనా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.

Details

అంగారక గ్రహం భవిష్యత్తులో ఎంతో కీలకం

ఈ క్రమంలోనే అంగారక గ్రహం భవిష్యత్తులో మనకెంతో కీలకంగా మారుతుందని చెప్పారు. 2026 చివరికి స్పేస్ ఎక్స్ రూపొందించిన స్టార్‌షిప్ రాకెట్ ద్వారా అంగారక గ్రహానికి సిబ్బందిని పంపే అవకాశం సుమారు 50 శాతముందని మస్క్ తెలిపారు. అయితే ఇది డిసెంబర్‌లో వచ్చే చిన్న గ్రహాల అనుకూల దశపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఆ సమయాన్ని కోల్పోతే తదుపరి అవకాశం 2028లో మాత్రమే వస్తుందని స్పష్టం చేశారు. మొదటి మిషన్‌లో మానవులను కాకుండా, టెస్లా అభివృద్ధి చేసిన ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్‌లను మార్స్ ఉపరితలంపైకి పంపాలని మస్క్ చెప్పారు. ఆ రోబోట్‌లు అంగారకంపై తిరుగుతున్న దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుందన్నారు. రోబోట్ మిషన్లు విజయవంతమైన తరువాతే మానవులను పంపుతామని చెప్పారు.

Details

 భూమిని వదిలి వేరే గ్రహంపై జీవించాల్సిన అవసరం తప్పనిసరి

ఆ తర్వాత అంగారకంపై మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని వివరించారు. ఫాక్స్ న్యూస్ హోస్ట్ జెస్సీ వాటర్స్‌తో ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూలో మస్క్ మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భూమిపై జీవించే అన్ని జీవులు సూర్యుడి వల్ల ఓ రోజు నాశనమవుతాయని, ఎందుకంటే సూర్యుడు క్రమంగా విస్తరిస్తూ ఉన్నాడని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మనం ఏదో ఒక సమయంలో భూమిని వదిలి వేరే గ్రహంపై జీవించాల్సిన అవసరం తప్పదని అన్నారు. భూమి నివాసయోగ్యంగా ఉండే కాలం మరో 450 మిలియన్ సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుందన్నది మస్క్ అంచనా.

Details

భవిష్యత్తులో భూమి పాడైపోయే ప్రమాదం

కానీ, అణు యుద్ధం, ఏఐ ప్రభావం, పెద్దమొత్తంలో వచ్చే మహమ్మారుల కారణంగా సమీప భవిష్యత్తులోనే భూమి పాడైపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. 2030 నాటికి స్పేస్ ఎక్స్ మొత్తం 100 స్టార్‌షిప్‌లను అంగారక గ్రహానికి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2033 నాటికి ఈ సంఖ్య 500కి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీని ద్వారా భూమి నుంచి సహాయం లేకుండా స్వయం సమృద్ధిగా ఉండగల, సుమారు లక్షలాది మంది నివసించే అంగారక నాగరికతను నిర్మించడం తాముద్దేశించిన ప్రధాన ఉద్దేశమని మస్క్ స్పష్టం చేశారు.