LOADING...
Ozone Layer:భూమికి రక్షణ కవచం మళ్లీ బలపడుతోంది.. ఐరాస తాజా నివేదిక
భూమికి రక్షణ కవచం మళ్లీ బలపడుతోంది.. ఐరాస తాజా నివేదిక

Ozone Layer:భూమికి రక్షణ కవచం మళ్లీ బలపడుతోంది.. ఐరాస తాజా నివేదిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

భూమికి రక్షణ కవచంగా నిలిచే ఓజోన్ పొర మళ్లీ కోలుకుంటోందని ఐక్యరాజ్య సమితి (UN) వెల్లడించింది. రాబోయే దశాబ్దాల్లో అంటార్కిటికాపై ఏర్పడిన ఓజోన్ రంధ్రం పూర్తిగా మూసుకుపోనుందని యూఎన్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ దేశాలు కలసి తీసుకున్న కఠిన చర్యల వలన ఈ విజయం సాధ్యమైందని నివేదిక స్పష్టంచేసింది. ఈ నివేదికను యూఎన్ వరల్డ్ మెటియోరాలజికల్ ఆర్గనైజేషన్ (WMO) తాజాగా విడుదల చేసింది. అందులో అంటార్కిటికా పైభాగంలో ఉన్న ఓజోన్ రంధ్రం 2024లో గతంతో పోలిస్తే చిన్నదిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Details

యూఎన్ చీఫ్ స్పందన

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కూడా స్టేట్మెంట్ విడుదల చేశారు. శాస్త్రవేత్తల హెచ్చరికలు ఫలితమిచ్చాయి, ఇప్పుడు ఓజోన్ పొర కోలుకుంటోంది. ఇది ఒక గొప్ప పురోగతి" అని ఆయన వ్యాఖ్యానించారు. ఓజోన్ బులెటిన్ - 2024 ప్రపంచ వాతావరణ సంస్థ విడుదల చేసిన 'ఓజోన్ బులెటిన్ 2024' ప్రకారం, సహజసిద్ధమైన పరిణామాల వల్ల గతంలో సన్నగిల్లిన ఓజోన్ పొర ఇప్పుడు నిలకడ దిశగా వెళ్తోందని తేలింది. దీర్ఘకాల దృష్టితో చూస్తే ఇది శాస్త్రవేత్తల గొప్ప విజయమని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 'క్లోరోఫ్లోరో కార్బన్ల (CFCs) వినియోగాన్ని తగ్గించడంపై అంతర్జాతీయ ఒత్తిడి' తెచ్చినందువల్లే ఓజోన్ బలహీనత ఆగిపోయిందని తెలిపింది.

Details

చరిత్రలో ఓజోన్ రక్షణ చర్యలు

వరల్డ్ ఓజోన్ డే సందర్భంగా ఈ బులెటిన్ విడుదల చేశారు. అలాగే వియన్నా కన్వెన్షన్ 40 ఏళ్లు పూర్తి కావడంతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 1975లో జరిగిన ఆ సమావేశంలోనే ఓజోన్ పొర సన్నగిల్లిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దాని కొనసాగింపుగా, 1987లో 'మాంట్రియల్ ప్రోటోకాల్' విడుదలైంది. దీని ద్వారా ఫ్రిజ్‌లు, ఎయిర్ కండీషనర్లు, ఏరోసోల్ స్ప్రేస్‌లలో ఓజోన్‌కు హానికరమైన రసాయనాల వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించారు.

Details

 భవిష్యత్తు అంచనాలు 

ప్రస్తుతం ఓజోన్ పొర 'రికవరీ ట్రాక్'లో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శతాబ్దం మధ్య నాటికి, అంటే 1980ల స్థాయికి తిరిగి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీని వలన స్కిన్ క్యాన్సర్, కాటరాక్ట్ వంటి వ్యాధులు తగ్గుతాయని, అంతేకాకుండా 'అతినీలలోహిత కిరణాల ప్రభావం కూడా నియంత్రణలోకి వస్తుందని' నివేదిక పేర్కొంది. తాజా డేటా గత సంవత్సరం సెప్టెంబర్ 29, 2024 నాటికి అంటార్కిటికా వద్ద ఓజోన్ పొరలో 46.1 మిలియన్ టన్నుల మాస్ డెఫిసిట్ నమోదైంది. ఇది 1990-2020 మధ్యకాల సగటుతో పోలిస్తే తక్కువగా ఉందని నివేదిక వివరించింది.