LOADING...
Space-X : అంతరిక్షంలో స్పేస్‌-X దూకుడు.. ఉపగ్రహ ప్రయోగాల్లో రికార్డు
అంతరిక్షంలో స్పేస్‌-X దూకుడు.. ఉపగ్రహ ప్రయోగాల్లో రికార్డు

Space-X : అంతరిక్షంలో స్పేస్‌-X దూకుడు.. ఉపగ్రహ ప్రయోగాల్లో రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ భూమిపై మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్‌ సేవలను అందించాలన్న లక్ష్యంతో ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌-X సంస్థ వేగంగా ముందుకెళ్తోంది. అంతరిక్ష ప్రయోగాల్లో వరుస విజయాలు సాధిస్తున్న ఈ సంస్థ త్వరలోనే ఓ అరుదైన మైలురాయిని అందుకోబోతోంది. 1957లో అంతరిక్ష యుగం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు, ప్రైవేట్‌ సంస్థలు కలిసి మొత్తం 15,062 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించాయి. అయితే వాటిలో దాదాపు అన్నింటికీ సమానంగా ఒక్క స్పేస్‌ఎక్స్‌ సంస్థే 14,844 ఉపగ్రహాలను ప్రయోగించడం విశేషంగా మారింది. ఇక మరో 200 శాటిలైట్లను మస్క్‌ సంస్థ అంతరిక్షంలోకి ప్రయోగిస్తే.. ప్రపంచంలోనే అత్యధిక ఉపగ్రహాలు ప్రయోగించిన సంస్థగా చరిత్ర సృష్టిస్తుంది.

వివరాలు 

'స్టార్‌షిప్‌' అభివృద్ధిపై దృష్టి

ఉపగ్రహాల ప్రయోగ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు స్పేస్‌-ఎక్స్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ వ్యవస్థగా భావిస్తున్న 'స్టార్‌షిప్‌' అభివృద్ధిపై దృష్టి సారించింది. భవిష్యత్‌ అంతరిక్ష ప్రయాణాలకు ఇది కీలకంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మరోవైపు, స్టార్‌లింక్‌ ఉపగ్రహాల సంఖ్య భారీగా పెరగడం ఖగోళ పరిశోధనలకు ఇబ్బందులు కలిగిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్‌ హోల్‌లు, సుదూర గెలాక్సీలపై నిర్వహించే పరిశోధనలపై వీటి ప్రభావం పడుతోందని చెబుతున్నారు. అలాగే భూమి కక్ష్యలో రద్దీ పెరగడం, అంతరిక్ష వ్యర్థాలు అధికమవడం వంటి సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

కక్ష్యలో 86 భారతీయ ఉపగ్రహాలు

అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ కూడా తనదైన ముద్ర వేస్తోంది. అధికారిక వివరాల ప్రకారం ప్రస్తుతం భూమి కక్ష్యలో 86 భారతీయ ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో 27 ఉపగ్రహాలు మాత్రమే ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. కమ్యూనికేషన్‌, నావిగేషన్‌, భూపరిశీలన, శాస్త్రీయ పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన ఉపగ్రహ సామర్థ్యాలను నిరంతరం విస్తరిస్తోంది.

Advertisement