Musk Neuralink: న్యూరాలింక్ 'బ్లైండ్‌సైట్' పరికరానికి ఆమోదం..
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కి చెందిన బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ (Neuralink) మరో విశిష్టమైన ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ కంపెనీ పుట్టుకతో అంధులైన వ్యక్తులకు చూపును అందించగల పరికరాన్ని రూపకల్పన చేయనుంది. ఇందుకు అవసరమైన ప్రయోగ పరికరాన్ని అమర్చేందుకు, న్యూరాలింక్ యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతిని పొందినట్లు వెల్లడించింది. ''న్యూరాలింక్ రూపొందిస్తున్న బ్లైండ్‌సైట్ పరికరం అంధులకు అమోఘంగా సహాయపడుతుంది. ఈ పరికరం ద్వారా, వారు రెండు కళ్లతో చూడకపోయినా, ఆప్టిక్ నరానికి అనుసంధించబడిన బ్లైండ్‌సైట్ డివైజ్ ద్వారా ప్రపంచాన్ని చూడగలుగుతారు. పుట్టుకతో అంధులైనవారు సైతం దీనిద్వారా ప్రపంచాన్ని చూసే అవకాశం పొందుతారు'' అని ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.
న్యూరాలింక్ చేసిన ట్వీట్
చిప్‌ను అమర్చించిన తొలి వ్యక్తి నోలాండ్ అర్బాగ్
ఎలాన్ మస్క్ సంస్థ న్యూరాలింక్ మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చే ప్రయోగాలను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో చిప్‌ను అమర్చించిన తొలి వ్యక్తి నోలాండ్ అర్బాగ్‌ను మార్చిలో ప్రజల ముందుకు పరిచయం చేసింది. పక్షవాతంతో బాధపడుతున్న ఆయనను వీడియో గేమ్ సివిలైజేషన్ VI,చెస్ ఆడించడం జరిగింది, దీన్ని 'ఎక్స్' ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. అర్బాగ్ ఎవరి సహాయం లేకుండా స్వతంత్రంగా ఈ గేమ్‌లు ఆడినట్లు వెల్లడించారు. లైవ్ స్ట్రీమ్ సమయంలో అర్బాగ్ మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరికి మరింతమంది వ్యక్తుల మెదళ్లలో ఈ పరికరాన్ని అమర్చబోతామని ఎలాన్ మస్క్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు న్యూరాలింక్ మరో కొత్త పరికరం గురించి కూడా వెల్లడించింది.