యూరోపియన్ శాస్త్రవేత్తల ఘనత: అంగారకుడి పై నుండి లైవ్ స్ట్రీమింగ్
అరుణ గ్రహం మీద అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ గ్రహం మీద జీవం ఉందా అని వెతకడం దగ్గరి నుండి జీవించడానికి పనికి వస్తుందా అని వెతకడం వరకూ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా అంగారక గ్రహం నుండి లైవ్ స్ట్రీమింగ్ జరిగింది.అంగారక గ్రహంపై నుండి లైవ్ స్ట్రీమింగ్ వీడియోను నిర్వహించింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అంగారక గ్రహంపై తిరుగుతున్న మార్స్ ఎక్స్ ప్రెస్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఈ స్ట్రీమింగ్ ను నిర్వహించారు. స్ట్రీమింగ్ అయిన వీడీయో ఫీడ్, 17నిమిషాల్లో భూమికి చేరుకుందని శాస్త్రవేత్తలు వెల్లడి చేసారు. ఈ లైవ్ స్ట్రీమింగ్ జూన్ 2వ తేదిన రాత్రి 9:15గంటలకు జరిగింది.
వెబ్ కెమెరా సాయంతో లైవ్ స్ట్రీమింగ్
మార్స్ ఎక్స్ ప్రెస్ లోని వీడియో మానిటరింగ్ కెమెరా(వీ ఎమ్ సీ) సాయంతో ఈ లైవ్ స్ట్రీమింగ్ జరిగిందని శాస్త్రవేత్తలు తెలియజేసారు. ఈ కెమెరాను వెబ్ కెమెరాగా ఉపయోగించి, లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించారు. ఈ స్ట్రీమింగ్ నుండి వచ్చిన చిత్రాలు భూమిని చేరడానికి 17నిమిషాల సమయం పట్టిందట. అంగారక గ్రహం మీద పరిశోధనలు నిర్వహించడానికి 2003లో మార్స్ ఎక్స్ ప్రెస్ పేరుతో స్పేస్ క్రాఫ్ట్ ని పంపింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.