First-in-India: దేశీయ రూట్లలో ఉచిత ఇన్-ఫ్లైట్ వై-ఫైని పరిచయంచేసిన ఎయిర్ ఇండియా
ఈ వార్తాకథనం ఏంటి
తరచుగా విమానాల్లో ప్రయాణించే వారు కిటికీ నుంచి బయటను చూడటంపై ఆసక్తి కోల్పోతుంటారు.
అలా అని నిద్రపోడానికి ప్రయత్నించినా కొందరికి నిద్ర పట్టదు. కనీసం ఫోన్ ఉపయోగించుకుందామనుకున్నా సిగ్నల్ అందుబాటులో లేక ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇలాంటి సమస్యల కారణంగా ఎన్నో ఏళ్లుగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే, ఈ సమస్యలకు ఎయిర్ ఇండియా శాశ్వత పరిష్కారం చూపబోతుంది.
దేశీయ, అంతర్జాతీయ విమాన సేవల్లో వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రయాణికులకు వినోదాన్ని అందిస్తోంది. ఇప్పుడు ఈ వివరాలను తెలుసుకుందాం.
వివరాలు
కేవలం కొన్ని విమానాల్లోనే వైఫై సౌకర్యం!
టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా, ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా, విమానాల్లో వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చింది.
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని పలు విమానాల్లో ఈ సేవలు ప్రారంభించగా, ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది.
ముఖ్యంగా, ఎయిర్ బస్ A350, బోయింగ్ 787-9, A321neo విమానాల్లో వైఫై అందుబాటులో ఉంది.
వైఫై సదుపాయం కల్పించిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా చరిత్ర సృష్టించింది.
వివరాలు
బ్రౌజింగ్, చాటింగ్‌తో పాటు సోషల్ మీడియా వినియోగం
ప్రయాణికులు వైఫై ఉపయోగించి బ్రౌజింగ్, సోషల్ మీడియా వాడకాన్ని కొనసాగించవచ్చు.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాటింగ్ చేసేందుకు కూడా ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్లన్నింటికి వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు.
అయితే, ఇది 10,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
వివరాలు
ప్రతి ప్రయాణికుడు ఉపయోగించాలి
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చామని, ప్రయాణంలో ప్రతీ ఒక్కరూ ఈ సదుపాయాన్ని ఆస్వాదించాలని ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా తెలిపారు.
అంతర్జాతీయ సేవల్లో ఇప్పటికే అందిస్తున్న ఎయిర్ బస్ A350 పైలట్ ప్రాజెక్టు ద్వారా దేశీయ సేవల్లో కూడా వైఫైని విస్తరించామని పేర్కొన్నారు.
అంతర్జాతీయ గమ్యస్థానాలైన న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ విమానాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉందని చెప్పారు.