Asteroids Near Earth: భూమివైపు వరుసగా 5 గ్రహశకలాలు.. రాబోయే 2 రోజులల్లో ఏం జరగబోతున్నది
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్షం నుంచి భూమివైపు దూసుకొస్తున్న ఐదు గ్రహశకలాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. నవంబర్ 19న నాలుగు గ్రహశకలాలు భూమికి సమీపంగా ప్రయాణించగా, ఐదోది నవంబర్ 20న దగ్గరగా రానుంది. అయితే వీటివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసింది. ఈ ఐదు శకలాలు వేర్వేరు పరిమాణాల్లో ఉన్నప్పటికీ, మన గ్రహానికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోనే ప్రయాణిస్తున్నాయి. వాటి కదలికలు, వేగం, కక్ష్యలను శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తున్నారు.
Details
ఒక్కొక్కటి ఒక్కో పరిమాణం.. భూమికి లక్షల కిలోమీటర్ల దూరం
నవంబర్ 19న భూమికి దగ్గరగా వచ్చిన మొదటి గ్రహశకలం 2026 VA11. దీని పరిమాణం 40 అడుగులు కాగా, భూమికి 33.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించింది.
2026 TB84 అనే రెండో శకలం 210 అడుగుల పరిమాణంతో 46.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లింది.
64 అడుగుల 2007 WK3, 230 అడుగుల 2018 NE1 కూడా వరుసగా 54.7 లక్షలు, 63.9 లక్షల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించాయి.
Details
నవంబర్ 20న మరో గ్రహశకలం.. నాసా నిఘా
ఐదో గ్రహశకలం 2026 VD6 నవంబర్ 20న భూమికి అత్యంత సమీపంగా రానుంది. ఇది సుమారు 4,020,000 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించనుంది.
భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాలపై నాసా ప్రత్యేకంగా నిఘా ఉంచుతుంది. జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలోని సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (CNEOS) వీటి కక్ష్యలు, పరిమాణాలు, వేగం, భూమికి మధ్య దూరాన్ని లెక్కిస్తుంది.
ఈ వివరాల ఆధారంగా భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులను అంచనా వేస్తుంది.
Details
భూమికి ప్రమాదం ఉందా? నాసా ఏం చెబుతోంది?
సూర్యుడి నుంచి 19.5 కోట్ల కిలోమీటర్ల పరిధిలోకి వచ్చే కక్ష్యలు కలిగిన గ్రహశకలాలు, తోకచుక్కలను నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్‌గా పరిగణిస్తారు.
వీటిలో కొన్ని భూమి కక్ష్యకు దగ్గరగా ప్రయాణించే అవకాశం ఉండటంతో శాస్త్రవేత్తలు నిరంతరం పరిశీలిస్తుంటారు.
అయితే ప్రస్తుతం ఈ ఐదు గ్రహశకలాల వల్ల భూమికి ప్రమాదం లేదని నాసా చెబుతోంది.
అయినప్పటికీ అంతరిక్షంలో తిరిగే శకలాలన్నింటినీ ముందుగానే గుర్తించడం సాధ్యం కాదు. అందుకే వాటి కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం శాస్త్రవేత్తలకు కీలకంగా మారింది.