
Mo Gawdat: 'తర్వాతి 15 ఏళ్లు నరకమే .. జాబ్స్ అన్నీ ఏఐకు.. గూగుల్ మాజీ అధికారి హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తుపై భయాందోళన కలిగించే హెచ్చరికను గూగుల్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. వచ్చే 15 ఏళ్లలో మనిషి చేసే దాదాపు అన్ని ఉద్యోగాలనూ ఏఐ తిరగరాస్తుందని,ఇంతవరకూ సేఫ్‌గా అనుకున్న జాబ్స్ కూడా ఇక మిగలవని ఆయన స్పష్టం చేశారు. గూగుల్ ఎక్స్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసిన మో గాడ్‌దాట్,"డైరీ ఆఫ్ ఏ సీఈఓ"అనే పోడ్కాస్ట్‌లో మాట్లాడారు. "మనం స్వర్గం చూడాలంటే ముందు 15ఏళ్లు నరకంలో గడపాల్సిందే" అని ఆయన వ్యాఖ్యానించారు. తాను స్థాపించిన స్టార్టప్ ఉదాహరణగా చెబుతూ,"ఇది రిలేషన్‌షిప్స్ కోసం ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఏఐని తయారు చేస్తోంది.దీన్ని నడిపేందుకు ముగ్గురు సరిపోతారన్నారు. ఇదే పని కొన్ని ఏళ్ల క్రితమైతే 350మంది డెవలపర్లు కావాల్సివచ్చేది" అన్నారు.
వివరాలు
ఏజీఐ మనుషులకంటే ఏ పని అయినా మెరుగ్గా చేస్తుంది
అంటే, ఏఐ వల్ల ఎంత భీకరమైన పనినష్టం జరుగుతుందో ఊహించొచ్చు. గాడ్‌దాట్ అంచనా ప్రకారం,ఈ వేగవంతమైన ఏఐ అభివృద్ధి మానవ ఉద్యోగాలే కాదు,మధ్య తరగతిని కూడా నిర్మూలించే ప్రమాదం ఉంది. "మీరు టాప్ 0.1 శాతం లో లేకపోతే, వ్యవస్థలో మీరు బానిసే. ఏజీఐ (Artificial General Intelligence) మనుషులకంటే ఏ పని అయినా మెరుగ్గా చేస్తుంది .. ఒక CEOగా పని చేయడాన్ని కూడా" అని ఆయన హెచ్చరించారు. ఇంతటి మార్పులు తీవ్ర సామాజిక సమస్యలకు దారితీయొచ్చని గాడ్‌దాట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు పోయిన తర్వాత ప్రజలు తమ గుర్తింపు కోల్పోవచ్చు,ఒంటరితనం,మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. "భవిష్యత్తులో చాలా పెద్ద సామాజిక అశాంతి చూడబోతున్నాం"అని అన్నారు.
వివరాలు
ఏఐ తనకి తానుగా ఓ భాషను అభివృద్ధి చేసుకుని..
ఈ హెచ్చరికలు మరో ఏఐ పితామహుడు జెఫ్రీ హింటన్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తాయి. హింటన్ కూడా ఇటీవలే "ఏఐ తనకి తానుగా ఓ భాషను అభివృద్ధి చేసుకుని మనకి అర్థం కాకుండా ఆలోచించగలదు" అని హెచ్చరించారు. "అవి తమ భాషలో ఆలోచించడం మొదలుపెడితే, అవి ఏమనుకుంటున్నాయో మనకి తెలీదు" అని హింటన్ తెలిపారు. ఈ నేపథ్యంలో, మనిషి స్థానంలో మెషీన్లు పనిచేసే భవిష్యత్తుకు సమాజం ఇప్పటినుంచే సిద్ధం కావలసిన అవసరం ఉందని, మనిషి జీవనార్థం,దిశ, భద్రతను కొత్తగా నిర్వచించుకోవాల్సిన సమయం వచ్చేసిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.