Discovery Loop: గూగుల్‌ను వీడిన నలుగురు ఏఐ దిగ్గజాలు.. 'డిస్కవరీ లూప్' స్టార్టప్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్‌లో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో కీలక పాత్ర పోషించిన నలుగురు ప్రముఖ నిపుణులు సంస్థను వీడి కొత్త స్టార్టప్‌ను ప్రారంభించారు. 'డిస్కవరీ లూప్' (Discovery Loop)పేరుతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ శాస్త్రీయ పరిశోధనలను మరింత వేగవంతం చేయడానికి, ఏఐ సాయంతో కొత్త ఆవిష్కరణలకు దారి తీసేందుకు పనిచేయనుంది. ఈ స్టార్టప్‌ను గూగుల్‌లో ప్రముఖ ఏఐ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన జెఫ్ డీన్ (Jeff Dean),సంజయ్ ఘేమావత్ (Sanjay Ghemawat) కలిసి ప్రారంభించారు. వీరితో పాటు డీప్‌మైండ్ (DeepMind)పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్,జెమినీ (Gemini) టెక్నికల్ లీడ్ ఒరియోల్ విన్యాల్స్ (Oriol Vinyals),అలాగే గూగుల్ బ్రెయిన్ (Google Brain) సహ వ్యవస్థాపకుడు క్వాక్ లే (Quoc Le)కూడా ఈ బృందంలో ఉన్నారు.
వివరాలు
శాస్త్రీయ పరిశోధనలను ఆటోమేట్ చేయడమే లక్ష్యం
డిస్కవరీ లూప్ అత్యాధునిక ఏఐ అల్గోరిథమ్‌లను ఉపయోగించి ఒకేసారి వేలాది ప్రయోగాలను నిర్వహించే విధానాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దీనివల్ల శాస్త్రీయ పరిశోధనల్లో కొన్ని కీలక దశలను ఆటోమేట్ చేయడంతో పాటు, ప్రయోగాల పరిమాణాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంటుందని సంస్థ భావిస్తోంది.
జెఫ్ డీన్ అభిప్రాయం ప్రకారం, వేల సంఖ్యలో ఆటోమేటెడ్ పరిశోధనా చక్రాలు (Experiment Loops) నిర్వహించడం ద్వారా జీవశాస్త్రం, ఔషధాల అభివృద్ధి, చిప్ డిజైన్ వంటి అనేక రంగాల్లో కీలక ఆవిష్కరణలు సాధ్యమవుతాయి.
ప్రారంభ దశలో సంస్థ అభివృద్ధి చేసే ఈ ఆటోమేటెడ్ విధానాలను తమ కంపెనీలోనే పరీక్షించి, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్‌లను మరింత మెరుగుపరచనున్నారు.
వివరాలు
కొత్త ఆవిష్కరణలు చేసే ఏఐ అభివృద్ధి దిశగా అడుగులు
మెరుగైన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్‌లను రూపొందించిన తర్వాత వాటిని ఇతర రంగాల్లోని క్లిష్ట సమస్యల పరిష్కారానికి ఉపయోగించే ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని బృందం భావిస్తోంది.
ముఖ్యంగా చిప్ డిజైన్, జీవశాస్త్రం, ఔషధాల ఆవిష్కరణ, కొత్త పదార్థాల రూపకల్పన వంటి రంగాల్లో మానవ సామర్థ్యాన్ని మించే స్థాయి పురోగతిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
"ఏఐ తదుపరి గొప్ప మైలురాయి కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మాత్రమే కాదు. స్వయంగా కొత్త ఆవిష్కరణలు చేసే స్థాయికి ఎదగడం" అని సంస్థ వ్యవస్థాపక బృందం సంయుక్త ప్రకటనలో పేర్కొంది.
భవిష్యత్‌లో శాస్త్రీయ పరిశోధనల వేగాన్ని పెంచడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.