Putin: రష్యా సైన్యంలో భారీ మార్పులు.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా సైనిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సైనిక దళాల సంస్థాగత నిర్మాణాన్ని ఆధునీకరించి,కమాండ్‌తో పాటు లాజిస్టిక్స్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రక్షణ మంత్రిత్వ శాఖలో పలువురు ఉన్నతాధికారులను కొత్త బాధ్యతలకు నియమించారు. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదలైంది. క్రెమ్లిన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నియామకాలపై పుతిన్ వివరాలు వెల్లడించారు. సైన్యంలోని కమాండ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆయుధాల సరఫరా,రవాణా, నిర్వహణ వ్యవస్థలను మరింత సమర్థంగా మార్చేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్,చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వివరాలు
మానవరహిత వ్యవస్థల విభాగానికి కొత్త అధిపతి
తాజా నియామకాల ప్రకారం అలెగ్జాండర్ సాంచిక్‌ను డిప్యూటీ రక్షణ మంత్రిగా నియమించారు.
ఆయుధాల కొనుగోలు, సేకరణ, సరఫరా వ్యవస్థల పర్యవేక్షణ బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
మరో డిప్యూటీ రక్షణ మంత్రిగా నియమితులైన వాలెరీ సోలోడ్‌చుక్ ఇకపై లాజిస్టిక్స్ సేవలను పర్యవేక్షించనున్నారు.
అలాగే, దొనెట్స్క్ ప్రాంతంలో కీలక సైనిక ఆపరేషన్లు నిర్వహిస్తున్న 'సెంటర్ గ్రూప్ ఆఫ్ ఫోర్సెస్' కమాండర్‌గా ఆండ్రీ ఇవానాయెవ్‌ను నియమించారు.
ఈస్టర్న్ మిలిటరీ డిస్ట్రిక్ట్ తాత్కాలిక కమాండర్‌గా ప్యోటర్ బోల్గారెవ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇటీవల ఏర్పాటు చేసిన మానవరహిత వ్యవస్థల (డ్రోన్) దళాలకు డెనిస్ లయామిన్‌ను కమాండర్‌గా నియమిస్తూ ఆ విభాగం బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
వివరాలు
ఇటీవల 25,000 మంది సైనికులను పెంచుతూ నిర్ణయం
ఇదిలా ఉండగా, రష్యా సైనిక బలాన్ని మరింత పెంచే లక్ష్యంతో అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ప్రత్యేక డిక్రీపై సంతకం చేశారు.
ఆ నిర్ణయం ప్రకారం సైనిక సిబ్బంది సంఖ్యను మరో 25 వేల మేర పెంచారు.
ఈ పెంపుతో రష్యా సాయుధ దళాల మొత్తం బలగాల సంఖ్య 24,26,130కు చేరుకుంది.
వీరిలో క్రియాశీల సైనికుల సంఖ్య 15,35,000గా నమోదైంది. కొత్త నియామకాలు, సిబ్బంది పెంపు ద్వారా రష్యా సైన్యాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.