LOADING...
#NewsBytesExplainer: టెలిగ్రామ్‌పై ప్రపంచ దేశాల కన్నెర్ర.. అసలు కారణాలేంటి?

#NewsBytesExplainer: టెలిగ్రామ్‌పై ప్రపంచ దేశాల కన్నెర్ర.. అసలు కారణాలేంటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2026
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో టెలిగ్రామ్ ఒకటి. రష్యాలో జన్మించిన వ్యాపారవేత్త పావెల్ డురోవ్ స్థాపించిన ఈ వేదిక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. గోప్యతకు పెద్దపీట వేయడం,ప్రభుత్వ సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా నిలవడం,భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల టెలిగ్రామ్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. రాజకీయ కార్యకర్తలు,జర్నలిస్టులు,ఉద్యమకారులు,ప్రతిపక్ష నాయకులు అనేక దేశాల్లో సమాచార మార్పిడి కోసం ఈ యాప్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే,మరోవైపు టెలిగ్రామ్‌పై తీవ్ర విమర్శలు కూడా ఉన్నాయి. సరైన కంటెంట్ నియంత్రణ లేకపోవడం,చట్ట అమలు సంస్థలకు తగిన సహకారం అందించకపోవడం వల్ల మోసాలు,నకిలీ వార్తలు,తీవ్రవాద కార్యకలాపాలు,అక్రమ వ్యాపారాలు,సైబర్ నేరాలకు ఈ వేదిక ఉపయోగపడుతోందని ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి.

ప్రత్యేకం

టెలిగ్రామ్ ఎందుకు ప్రత్యేకం?

దీంతో ప్రపంచంలోని పలు దేశాలు టెలిగ్రామ్‌పై నిషేధాలు, పరిమితులు లేదా కఠిన నిఘా చర్యలు చేపట్టాయి. ఇతర మెసేజింగ్ యాప్‌లతో పోలిస్తే టెలిగ్రామ్‌లో భారీ సంఖ్యలో సభ్యులతో గ్రూపులు, పరిమితి లేని పబ్లిక్ ఛానెల్స్ నిర్వహించవచ్చు. ఒకే సందేశాన్ని లక్షల మందికి చేరవేయడం సులభం. దీంతో ఇది మెసేజింగ్ యాప్‌తో పాటు సోషల్ మీడియా, వార్తా వేదిక, ప్రచార సాధనంగా కూడా మారింది. అయితే, ఇదే వ్యవస్థ తప్పుడు ప్రచారం, పరీక్షా పేపర్ లీకులు, ఆర్థిక మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, నేర కార్యకలాపాలకు కూడా వేదికగా మారుతోందనే విమర్శలు ఉన్నాయి.

భారత్‌లో ఆంక్షలు

భారత్‌లో టెలిగ్రామ్‌పై తాజా ఆంక్షలు

టెలిగ్రామ్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్. దేశంలో 15 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అయితే నీట్-యూజీ 2026 పరీక్ష వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) సూచనల మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్ చేస్తున్న ముఠాలు టెలిగ్రామ్ ఛానెల్స్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. 'ప్రైవేట్ మాఫియా','రీ-నీట్ 2026' వంటి పేర్లతో నడిచిన కొన్ని ఛానెల్స్ ప్రశ్నపత్రాలను అందిస్తామని చెప్పి వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

భారత్‌లో ఆంక్షలు

భారత్‌లో టెలిగ్రామ్‌పై తాజా ఆంక్షలు

అంతేకాదు, పరీక్ష తర్వాత మెసేజ్‌లను ఎడిట్ చేసి ముందుగానే ప్రశ్నలు తెలిసినట్లు విద్యార్థులను మోసం చేస్తున్నారని గుర్తించారు. దీంతో జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పైనా పరిమితులు విధించారు. అలాగే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి టెలిగ్రామ్‌ను తొలగించాలని ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్ తీవ్రంగా విమర్శించారు. కోట్లాది సాధారణ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, అసలు నేరస్థులు ఇతర యాప్‌లకు మారిపోతారని వ్యాఖ్యానించారు.

Advertisement

చైనా 

చైనాలో పదేళ్లుగా నిషేధం

చైనాలో 2015 నుంచే టెలిగ్రామ్ నిషేధంలో ఉంది. దేశంలోని 'గ్రేట్ ఫైర్‌వాల్' విధానంలో భాగంగా విదేశీ డిజిటల్ సేవలను ప్రభుత్వం కట్టడి చేస్తోంది. రాజకీయ కార్యకర్తలు, మానవ హక్కుల న్యాయవాదులు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమకారులు టెలిగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారని చైనా భావించింది. ముఖ్యంగా 2019 హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమంలో టెలిగ్రామ్ కీలక పాత్ర పోషించడంతో ఆందోళనలు మరింత పెరిగాయి.

ఇరాన్,రష్యా 

ఇరాన్, రష్యాలో పరిస్థితి

ఇరాన్‌లో 2018లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో టెలిగ్రామ్ ప్రధాన కమ్యూనికేషన్ వేదికగా మారింది. నిరసనలకు మద్దతుగా ఉన్న ఛానెల్స్‌ను మూసివేయాలని ప్రభుత్వం కోరినా టెలిగ్రామ్ నిరాకరించింది. దీంతో దేశవ్యాప్తంగా నిషేధం విధించారు. రష్యాలో కూడా 2018లో టెలిగ్రామ్‌పై నిషేధం అమలైంది. వినియోగదారుల సమాచారాన్ని భద్రతా సంస్థలకు ఇవ్వడానికి కంపెనీ నిరాకరించడంతో ఈ చర్య తీసుకున్నారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా 2020లో నిషేధాన్ని ఎత్తివేశారు. అయినప్పటికీ రష్యాలో ఇప్పటికీ పలు సాంకేతిక పరిమితులు కొనసాగుతున్నాయి.

ఇతర దేశాలు 

బ్రెజిల్,పాకిస్థాన్ సహా ఇతర దేశాల్లోనూ ఆంక్షలు

బ్రెజిల్‌లో ఎన్నికల తప్పుడు ప్రచారం, తీవ్రవాద కంటెంట్, ద్వేష ప్రసంగాల కారణంగా పలుమార్లు టెలిగ్రామ్ సేవలను నిలిపివేశారు. పాకిస్థాన్‌లో రాజకీయ ఉద్రిక్తతల సమయంలో ఆంక్షలు విధించారు. క్యూబాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో, థాయిలాండ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాల సందర్భంగా, అజర్‌బైజాన్‌లో యుద్ధ సమయంలో, స్పెయిన్‌లో కాపీరైట్ వివాదాల నేపథ్యంలో టెలిగ్రామ్‌పై పరిమితులు అమలయ్యాయి. ఉక్రెయిన్ ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక విభాగాల్లో టెలిగ్రామ్ వినియోగంపై ప్రత్యేక ఆంక్షలు ఉన్నాయి.

పావెల్ డురోవ్ 

ఫ్రాన్స్‌లో పావెల్ డురోవ్ అరెస్ట్

టెలిగ్రామ్ చరిత్రలో అత్యంత కీలక ఘట్టం 2024లో ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. పారిస్ విమానాశ్రయంలో దిగిన టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్‌ను ఫ్రెంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించిన కంటెంట్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక మోసాలు, సంఘటిత నేరాలకు టెలిగ్రామ్ సహకరిస్తోందని ఆరోపించారు. దర్యాప్తుకు సహకరించకపోవడంపై ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన తర్వాత టెలిగ్రామ్ తన విధానాల్లో మార్పులు చేసింది. దుర్వినియోగానికి అవకాశం ఉన్న కొన్ని ఫీచర్లను తొలగించడంతో పాటు, చట్టబద్ధమైన కోర్టు ఆదేశాలు ఉంటే ఐపీ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లను అధికారులకు అందించే విధంగా గోప్యతా విధానాన్ని సవరించింది.

టెలిగ్రామ్ 

టెలిగ్రామ్ చుట్టూ ప్రపంచ దేశాల సందిగ్ధం

టెలిగ్రామ్ ఒకవైపు భావప్రకటన స్వేచ్ఛకు అండగా నిలుస్తుంటే, మరోవైపు నేర కార్యకలాపాలకు వేదికగా మారుతోందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. చైనా, ఇరాన్, బెలారస్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఇది కీలక సాధనంగా మారగా.. మోసాలు, సైబర్ నేరాలు, తప్పుడు ప్రచారం, తీవ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. డిజిటల్ స్వేచ్ఛను కాపాడుతూనే ప్రజల భద్రతను ఎలా నిర్ధారించాలన్నది ప్రపంచ దేశాల ముందున్న పెద్ద సవాలుగా మారింది. టెలిగ్రామ్‌పై జరుగుతున్న వివాదాలు భవిష్యత్ డిజిటల్ పాలనకు దిశానిర్దేశం చేసే అంశంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement