Loading...
FSSAI vs Bisleri: బిస్లెరి నీటిలో బ్రోమేట్.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం? క్యాన్సర్ వస్తుందా?
బిస్లెరి నీటిలో బ్రోమేట్.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం? క్యాన్సర్ వస్తుందా?

FSSAI vs Bisleri: బిస్లెరి నీటిలో బ్రోమేట్.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం? క్యాన్సర్ వస్తుందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్యాకేజ్డ్ తాగునీటి నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. ప్రముఖ వాటర్ బ్రాండ్ బిస్లెరి నీటి నమూనాలో బ్రోమేట్ పరిమితికి మించి ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) గుర్తించింది. నవంబర్ 22న ఈ విషయాన్ని వెల్లడించిన సంస్థ.. అసురక్షిత తాగునీటి సరఫరాకు సంబంధించి బిస్లెరి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. అయితే, ఈ చర్య కేవలం గోవా ప్లాంట్‌లో 2025 సెప్టెంబర్ 27న తయారైన ఒక బ్యాచ్‌కు మాత్రమే సంబంధించినదని బిస్లెరి స్పష్టం చేసింది. ఏడాదికి 50 వేలకుపైగా బ్యాచ్‌లను తయారు చేస్తామని,సంబంధిత బ్యాచ్‌కు చెందిన నీటి బాటిళ్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేవని తెలిపింది.

వివరాలు 

మరో రసాయనం గుర్తింపు

మరోవైపు, రీటెస్టింగ్‌లో బ్రోమేట్ అనుమతించిన పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని కంపెనీ పేర్కొంది.

ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ 2025 సెప్టెంబర్ 30న గోవా ప్లాంట్ నుంచి ఆరు నమూనాలను సేకరించింది.

వీటిలో ఐదు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండగా, ఆరో నమూనాలో లీటరు నీటికి 12 మైక్రోగ్రాముల బ్రోమేట్ ఉన్నట్లు ప్రాథమిక పరీక్షలో గుర్తించారు.

అనుమతించిన పరిమితి 10 మైక్రోగ్రాములు మాత్రమే. బిస్లెరి విజ్ఞప్తితో ఆ నమూనాను మరోసారి పరీక్షించగా, బ్రోమేట్ పరిమితిలోనే ఉన్నట్లు తేలింది.

అయితే, అందులో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు కూడా గుర్తించారు.

వివరాలు 

బ్రోమేట్ అంటే ఏమిటి?

తాగునీటిని శుద్ధి చేసే ప్రక్రియలో ఏర్పడే రసాయన ఉప ఉత్పత్తినే బ్రోమేట్ అంటారు.

ముఖ్యంగా ఓజోన్‌తో నీటిని శుద్ధి చేసే సమయంలో నీటిలో బ్రోమైడ్ అయాన్లు ఉంటే ఇది ఏర్పడుతుంది.

ఒకసారి నీటిలో బ్రోమేట్ ఏర్పడితే తొలగించడం కష్టమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది.

బ్రోమేట్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా?

అధిక మోతాదులో బ్రోమేట్ శరీరంలోకి వెళ్తే వికారం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు రావచ్చు.

ఎక్కువ మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపై ప్రభావం పడటంతో పాటు వినికిడి సమస్యలు కూడా తలెత్తవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా?

ప్రయోగశాలల్లో జంతువులపై జరిపిన పరిశోధనల్లో బ్రోమేట్‌కు క్యాన్సర్ కలిగించే లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

ముఖ్యంగా ఎలుకల్లో దీర్ఘకాలం అధిక మోతాదులో బ్రోమేట్‌కు గురికావడం వల్ల క్యాన్సర్ వచ్చినట్లు అధ్యయనాలు వెల్లడించాయి.

అయితే, మనుషుల్లో బ్రోమేట్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.

గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఇప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు బ్రోమేట్ ప్రభావంపై మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే, తాగునీటిలో అనుమతించిన ప్రమాణాలకు దగ్గరగా ఉన్న మోతాదుల వల్ల పునరుత్పత్తి ఆరోగ్యానికి ముప్పు ఉన్నట్లు ఆధారాలు లేవని WHO పేర్కొంది.

ADVERTISEMENT