OnePlus merges with Realme: రియల్‌మీలో వన్‌ప్లస్ విలీనం.. వినియోగదారుల సేవలు యథాతథం
ఈ వార్తాకథనం ఏంటి
చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌కు సంబంధించిన మరో వార్త బయటకొచ్చింది. వన్‌ప్లస్ సంస్థ రియల్‌మీలో విలీనం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే రియల్‌మీ, ఒప్పోకు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. ఈ మూడు సంస్థలు బీబీకే ఎలక్ట్రానిక్స్ గ్రూప్‌కు చెందినవే కావడంతో, ఇకపై ఒకే నిర్వహణలో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వ్యయాలను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వివరాలు
విలీనానంతరం ఏర్పడే కొత్త బృందాలకు పీట్ లౌ నాయకత్వం
చైనాకు చెందిన సామాజిక మాధ్యమ వేదిక విబోలో 'డిజిటల్ చాట్ స్టేషన్' పేరుతో ప్రసిద్ధి పొందిన సాంకేతిక సమాచారం అందించే వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, చైనా కార్యకలాపాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్‌ప్లస్ కార్యకలాపాలన్నీ రియల్‌మీలో కలిసిపోనున్నాయి. ఈ విలీనానంతరం ఏర్పడే కొత్త బృందాలకు ఒప్పో ప్రధాన ఉత్పత్తుల అధికారి, వన్‌ప్లస్ వ్యవస్థాపకుడు పీట్ లౌ నాయకత్వం వహించనున్నారు. మార్కెటింగ్,విక్రయానంతర సేవలను ఒకే వ్యవస్థ కింద నిర్వహించనున్నారు. అలాగే, కొత్త ఉత్పత్తుల రూపకల్పనలో రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. దీని ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అయితే విలీనానంతరం కూడా వన్‌ప్లస్, రియల్‌మీ తమ తమ పేర్లతోనే ఫోన్లను మార్కెట్లో విడుదల చేయనున్నాయి.
వివరాలు
సేవా కేంద్రాల సంఖ్యను 50 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటన
వినియోగదారులకు సేవలు యథావిధిగా అందుతాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరిలో వన్‌ప్లస్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వదంతులు వినిపించాయి. దీంతో భారత్‌లోని వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఆ సమయంలో వన్‌ప్లస్ భారత ప్రధాన అధికారి రాబిన్ లియు సామాజిక మాధ్యమం ద్వారా ఆ వార్తలను ఖండించారు. అనంతరం మార్చిలో ఆయన పదవి నుంచి వైదొలిగినప్పుడు కూడా ఇలాంటి ప్రచారం జరిగింది. అప్పటికీ సంస్థ భారత్‌లో సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టంచేసింది. అంతేకాకుండా, సేవా కేంద్రాల సంఖ్యను 50 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఒప్పో సేవా కేంద్రాలను వినియోగిస్తూ ఈ విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ పరిణామాల మధ్య తాజా విలీన వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.