LOADING...
Ghost Particle:11,320 అడుగుల లోతులో గ్లిచ్? అంతరిక్షం నుంచి భూమిపై పడిన 'గోస్ట్ పార్టికల్' 
11,320 అడుగుల లోతులో గ్లిచ్? అంతరిక్షం నుంచి భూమిపై పడిన 'గోస్ట్ పార్టికల్'

Ghost Particle:11,320 అడుగుల లోతులో గ్లిచ్? అంతరిక్షం నుంచి భూమిపై పడిన 'గోస్ట్ పార్టికల్' 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023లో మధ్యధరా సముద్రం లోతుల్లో అమర్చిన KM3NeT డిటెక్టర్ ఒక ఆశ్చర్యకరమైన సిగ్నల్‌ను గుర్తించింది. మొదట అది ఒక గ్లిచ్ అయి ఉంటుందనుకున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే న్యూట్రినోస్ అనే ఈ కణాలను పట్టుకోవడం దాదాపు అసాధ్యం. వీటికి బరువు ఉండదు,ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉండదు,ఇతర కణాలతో పరస్పరం కలిసే అవకాశం కూడా చాలా తక్కువ. అయినా, 2023 ఫిబ్రవరిలో KM3NeT ఒక చిన్న సిగ్నల్‌ను పట్టుకోగలిగింది. ఆ తరువాత పరిశీలనల్లో అది 220 పీటా ఎలక్ట్రాన్ వోల్ట్స్ (PeV) శక్తి కలిగిన న్యూట్రినో అని నిర్ధారణకు వచ్చారు. ఇది ఇప్పటి వరకు రికార్డుల్లో ఎప్పుడూ లేని స్థాయి.

వివరాలు 

న్యూట్రినోలు విశ్వంలోనే అత్యధికంగా ఉన్న కణాలు

ఈ న్యూట్రినోను శాస్త్రవేత్తలు "గోస్ట్ పార్టికల్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి, మన శరీరాల్లోంచి కూడా వెళ్ళిపోతాయి కానీ మనకు ఎప్పుడూ కనిపించవు. శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, KM3-230213A అనే ఈ సిగ్నల్ ఖచ్చితంగా అదే 220-PeV న్యూట్రినో వల్లే వచ్చిందని ధృవీకరించారు. అయితే దీని మూలం ఎక్కడనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. కానీ ఇది భూమిపైకి దూర అంతరిక్షం నుంచి వచ్చినదే అన్న నమ్మకం శాస్త్రవేత్తల్లో బలంగా ఉంది. న్యూట్రినోలు విశ్వంలోనే అత్యధికంగా ఉన్న కణాలు.నక్షత్రాలు పేలిపోయే సమయంలో,లేదా రెండు నక్షత్రాలు కలిసే సమయంలో వీటి సంఖ్య అమాంతం పెరుగుతుంది.

వివరాలు 

హై ఎనర్జీ న్యూట్రినో ఒక్కటి గుర్తించని శాస్త్రవేత్తలు

సాధారణంగా ఇవి ఎవరితోనూ ప్రతిస్పందించకపోయినా,ఒకసారి కణంతో ఢీకొంటే, వెలుగురూపంలో (ఫోటాన్లు, మ్యూయాన్లు) చిన్న గ్లో లాంటి కాంతి కనిపిస్తుంది. అదే 11,320 అడుగుల లోతులో ఏర్పాటు చేసిన KM3NeT డిటెక్టర్‌లో జరిగింది. అయితే మొదట్లో శాస్త్రవేత్తలు దీన్ని నమ్మలేదు. ఎందుకంటే IceCube, Auger లాంటి ఇతర పెద్ద డిటెక్టర్లు ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా ఇలాంటి హై ఎనర్జీ న్యూట్రినో ఒక్కటినీ గుర్తించలేదు. ఈ నేపథ్యంలో, KM3NeT పట్టిన ఈ న్యూట్రినోనే మొదటి రికార్డెడ్ ఈవెంట్ అని ఇప్పుడు శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెబుతున్నారు.

వివరాలు 

 కొత్త ఆవిష్కరణతో మరో ఆసక్తికర అంశం 

ఈ కొత్త ఆవిష్కరణతో మరో ఆసక్తికర అంశం ముందుకు వచ్చింది. విశ్వంలో కొత్త రకాల న్యూట్రినో మూలాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా, 13.8 బిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడిన మొదటి కాంతితో కాస్మిక్ రేలు ఢీకొన్నప్పుడు ఉత్పత్తి అయ్యే కాస్మోజెనిక్ న్యూట్రినోస్ కావచ్చని ఒక వాదన ఉంది. లేదా కొత్త రకాల ఆస్ట్రోఫిజికల్ ఆబ్జెక్టులు ఈ అల్ట్రా హై ఎనర్జీ న్యూట్రినోలను విడుదల చేస్తున్న అవకాశం కూడా ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ న్యూట్రినో మన గెలాక్సీ మిల్కీ వే నుంచి రాలేదు. అది ఒక అత్యంత దూర అంతరిక్ష మూలం నుంచి వచ్చింది.