Godzilla El Niño: గాడ్జిల్లా ఎల్‌నినో ముప్పు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రమాద హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ రంగాలపై తీవ్ర ప్రభావం చూపగల శక్తివంతమైన ఎల్‌నినో పరిస్థితులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణంగా ప్రతి దశాబ్దంలో రెండు నుంచి మూడు సార్లు కనిపించే ఈ సముద్ర ఉష్ణ తరంగం ప్రస్తుతం భూమధ్యరేఖ పరిసర పసిఫిక్ మహాసముద్రంలో రూపుదిద్దుకుంటోందని, సెప్టెంబర్ నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ)ఇప్పటికే హెచ్చరించింది. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణ సరళిలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. దీని ప్రభావంతో ఆస్ట్రేలియా, ఆసియా,దక్షిణ ఆఫ్రికా ప్రాంతాల్లో కరువు ముప్పు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా ఖండంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన తుఫానులు, భారీ వర్షాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రకృతి విపత్తులకు కారణం అవుతున్న ఎల్‌నినో
గతంలో ఎన్నో తీవ్రమైన కరువులు, తుఫానులు నమోదైనా, ఈసారి రికార్డు స్థాయిలో అత్యంత శక్తివంతమైన ఎల్‌నినో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం, కార్చిచ్చులు, తీవ్ర కరువులు, వలసలు, అంతేకాకుండా సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల సంభవించే ప్రభావాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని "గాడ్జిల్లా ఎల్‌నినో"గా అభివర్ణిస్తున్నారు. శతాబ్దాలుగా ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రకృతి విపత్తులకు కారణమవుతోంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం,పెరూలోని ప్రాచీన మోచే నాగరికత పతనానికి కూడా ఎల్‌నినో ఒక ప్రధాన కారణంగా నిలిచింది.
వివరాలు
ఆహార సరఫరాపై తీవ్ర ప్రభావం
ప్రస్తుతం ప్రపంచ సరఫరా గొలుసులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టంగా ఉన్న నేపథ్యంలో గాడ్జిల్లా ఎల్‌నినో ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపనుందనే అంశంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. కరువులు, వరదలు పెరగడం వల్ల ప్రపంచ ఆహార వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. పంటల దిగుబడులు తగ్గిపోవడంతో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ సరఫరా గొలుసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు ఎరువుల రవాణాలో కీలకమైన హొర్ముజ్ జలసంధి పరిణామాల కారణంగా రైతులు అధిక ఎరువుల ధరల భారం మోస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం దీనిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.
వివరాలు
ఆహార సంక్షోభాలకు దారి
చరిత్రలో ఎల్‌నినో అనేక ఆహార సంక్షోభాలకు కారణమైంది. 1877-78 కాలంలో నమోదైన తీవ్ర కరువులు ఉష్ణమండల ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ప్రపంచ ఆహార వ్యవస్థలోని అసమానతలను అవి బహిర్గతం చేశాయి. ఇటీవల 2015-16 మధ్య చోటుచేసుకున్న శక్తివంతమైన ఎల్‌నినో సమయంలో దక్షిణాఫ్రికా దశాబ్దాల్లోనే అత్యంత తీవ్రమైన కరువును ఎదుర్కొంది. కీలక వ్యవసాయ ప్రాంతాల్లో వర్షపాతం భారీగా తగ్గిపోవడంతో మొక్కజొన్న దిగుబడులు కుప్పకూలాయి. ఫలితంగా లక్షల టన్నుల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాల్సి రావడంతో అక్కడ ఆహార ధరలు భారీగా పెరిగాయి.
వివరాలు
వలసల పెరుగుదలకు కారణం
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ప్రజల వలసలను కూడా పెంచగలవని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. తూర్పు ఆఫ్రికాలో ఎల్‌నినో ప్రభావం సాధారణంగా అధిక వర్షాలకు దారి తీస్తుంది. దీనివల్ల వరదలు సంభవించి లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతారు. మరోవైపు గ్వాటెమాలా, హోండురాస్, ఎల్ సాల్వడార్, నికరాగువా దేశాల్లో విస్తరించి ఉన్న మధ్య అమెరికా డ్రై కారిడార్ ప్రాంతం ఎల్‌నినో సంవత్సరాల్లో తీవ్రమైన కరువును ఎదుర్కొంటుంది. పంటలు దెబ్బతినడం, ఆహార కొరత పెరగడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
వివరాలు
యుద్ధాలు, అస్థిరతకు ఆజ్యం
ఎల్‌నినోతో ముడిపడిన తీవ్ర వాతావరణమార్పులు ఇప్పటికే బలహీనంగా ఉన్న దేశాల్లో మరింత అస్థిరతకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఘర్షణలు కొనసాగుతున్న ప్రాంతాల్లో నీరు,భూమి వంటి సహజ వనరులపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్నిసందర్భాల్లో ఈ వనరులను యుద్ధవ్యూహాల్లో భాగంగా కూడా ఉపయోగించే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. యెమెన్‌లో జరిగిన ఘర్షణల సమయంలో నీటి మౌలిక సదుపాయాలు పదేపదే దెబ్బతిన్న ఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. 2026లో సంభవించే ఎల్‌నినో వల్ల ఏ దేశాలు లాభపడతాయో,ఏ దేశాలు నష్టపోతాయో ఇప్పుడే చెప్పడం కష్టమే. అయితే దీనిప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉండబోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ ప్రభావం నిజంగానే గాడ్జిల్లా స్థాయి విధ్వంసాన్ని తలపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.