Rare Moon: ఖగోళ ప్రేమికులకు శుభవార్త.. చంద్రుడు, శుక్రుడు, గురుడు ఒకే ఫ్రేమ్‌లో.. ఎప్పుడు చూడాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఆకాశంలో అరుదైన ఖగోళ వింత కనిపించబోతోంది. మే 18 నుంచి 20 వరకు సాయంత్రం వేళల్లో చంద్రుడు, శుక్రుడు, గురుడు ఒకే దిశలో కనిపిస్తూ ఆకాశంలో అద్భుతమైన త్రిభుజాకార దృశ్యాన్ని సృష్టించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఖగోళ సంఘటనను ప్రత్యేక పరికరాలు లేకుండానే వీక్షించవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సందర్భంగా పలుచని నెలవంక చంద్రుడు ప్రకాశవంతమైన గ్రహాలైన శుక్రుడు, బృహస్పతిలకు సమీపంగా కనిపించనున్నాడు. చంద్రుడి తర్వాత రాత్రి ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే గ్రహాల్లో శుక్రుడు, గురుడు ముఖ్యమైనవి. ఈ రెండు గ్రహాల మధ్య నెలవంక చంద్రుడు చేరడంతో ఆకాశంలో ఆకర్షణీయమైన త్రిభుజాకారం ఏర్పడనుంది.
వివరాలు
వరుసగా మూడ్రోజులపాటు వీక్షించే అవకాశం
మే 18 నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. సూర్యాస్తమయం అయిన 30 నుంచి 60 నిమిషాల మధ్య పశ్చిమ దిశలో చూడగలిగితే ఈ దృశ్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని చూడటానికి టెలిస్కోప్ లేదా ప్రత్యేక పరికరాల అవసరం లేదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మేఘాలు లేని స్వచ్ఛమైన ఆకాశం, స్పష్టమైన పశ్చిమ దిక్కు ఉంటే ఈ అరుదైన దృశ్యాన్ని కళ్లారా ఆస్వాదించవచ్చని సూచిస్తున్నారు.