Telegram: యూజర్లకు గుడ్‌న్యూస్.. మళ్లీ అందుబాటులోకి వచ్చిన టెలిగ్రామ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ మళ్లీ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షల గడువు ముగియడంతో యాప్‌ను పునరుద్ధరించారు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో టెలిగ్రామ్ అందుబాటులో ఉండగా, యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రం ఇంకా డీలిస్ట్ అయినట్లుగానే కనిపిస్తోంది. నీట్ రీటెస్ట్ నిర్వహణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జూన్ 16న టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. పరీక్షల భద్రత దృష్ట్యా ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ యాప్‌పై, అలాగే జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై ఆంక్షలు అమలు చేసింది.
వివరాలు
తాత్కాలిక ఆంక్షలు ఎత్తివేత
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) చేసిన సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల 3న నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకైనట్లు ఆరోపణలు రావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. దీంతో 'నీట్-యూజీ' పరీక్షను మళ్లీ ఈ నెల 21న నిర్వహించారు. పునఃపరీక్ష ప్రక్రియ పూర్తవడంతో టెలిగ్రామ్‌పై విధించిన తాత్కాలిక ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది.