Google Chrome Security Flaw: గూగుల్ క్రోమ్‌లో సెక్యూరిటీ ముప్పు.. యూజర్లకు కేంద్రం కీలక సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో పలు భద్రతా లోపాలు గుర్తించినట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు యూజర్ల పాస్‌వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు, కుకీస్‌తో పాటు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది. CERT-In ప్రకారం ఈ భద్రతా లోపాలు Windows, macOS, Linux డివైస్‌లలో పనిచేస్తున్న గూగుల్ క్రోమ్ పలు వెర్షన్‌లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ లోపాలను ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపింది.
వివరాలు
పాత వెర్షన్ వాడితే మరింత ప్రమాదం
ఇలా జరిగితే యూజర్ల సిస్టమ్‌లపై అనధికారిక యాక్సెస్ పొందడం,ప్రమాదకర కోడ్‌ను అమలు చేయడం,బ్రౌజర్ సెక్యూరిటీని బైపాస్ చేయడం లేదా బ్రౌజర్‌ను క్రాష్ చేయడం వంటి ముప్పులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇటీవల ఎక్కువ మంది యూజర్లు బ్రౌజర్‌ల్లోనే లాగిన్ వివరాలు, పేమెంట్ సమాచారం, వ్యక్తిగత డేటా సేవ్ చేసుకుంటుండటంతో సైబర్ దాడులకు ఇవే ప్రధాన లక్ష్యాలుగా మారాయని CERT-In వెల్లడించింది. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, ఆఫీస్ పనుల కోసం క్రోమ్ ఎక్కువగా ఉపయోగించే వారు పాత వెర్షన్ వాడితే మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
వివరాలు
యూజర్లు ఏం చేయాలి?
వెంటనే గూగుల్ క్రోమ్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని CERT-In సూచించింది. సాధారణంగా గూగుల్ కొత్తగా గుర్తించిన భద్రతా లోపాలను సరిచేయడానికి సెక్యూరిటీ ప్యాచ్‌లను విడుదల చేస్తుంటుంది. అప్‌డేట్ ఆలస్యం చేస్తే సైబర్ ముప్పులు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. క్రోమ్ అప్‌డేట్ చేసుకోవాలంటే బ్రౌజర్ ఓపెన్ చేసి కుడి పైభాగంలో ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్ చేయాలి. అక్కడ "Help" ఆప్షన్‌లోకి వెళ్లి "About Google Chrome" ఎంచుకోవాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న అప్‌డేట్‌ను బ్రౌజర్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తుంది. ప్రక్రియ పూర్తయ్యాక బ్రౌజర్‌ను రీస్టార్ట్ చేయాలని సూచించింది.
వివరాలు
ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అప్‌డేట్ పూర్తయ్యే వరకు అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదని, తెలియని వెబ్‌సైట్లు ఓపెన్ చేయకుండా ఉండాలని, గుర్తు తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని CERT-In సూచించింది. ఆటోమేటిక్ అప్‌డేట్స్ ఆన్ చేస్తే భవిష్యత్తులో వచ్చే సెక్యూరిటీ ప్యాచ్‌లు కూడా వెంటనే పొందవచ్చని తెలిపింది. సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం పాత బ్రౌజర్లు ఫిషింగ్ దాడులు, మాల్వేర్ ఇన్‌ఫెక్షన్లు, డేటా చోరీ, ఆన్‌లైన్ మోసాలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. అందుకే బ్రౌజర్లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లు, యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఆన్‌లైన్ ముప్పులను చాలా వరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.