LOADING...
Google: అన్‌వెరిఫైడ్‌ యాప్‌ల డౌన్‌లోడ్‌ ఇక సులభం!
Google: అన్‌వెరిఫైడ్‌ యాప్‌ల డౌన్‌లోడ్‌ ఇక సులభం!

Google: అన్‌వెరిఫైడ్‌ యాప్‌ల డౌన్‌లోడ్‌ ఇక సులభం!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆండ్రాయిడ్‌లో అన్‌వెరిఫైడ్‌ యాప్‌లు (గూగుల్‌ అధికారికంగా నిర్ధారించని యాప్‌లు) ఇన్‌స్టాల్‌ చేసుకునే ప్రక్రియను గూగుల్‌ మరింత సులభతరం చేయబోతోంది. ఇప్పటి వరకు గూగుల్‌ అమలు చేసిన కఠినమైన సైడ్‌లోడింగ్‌ పరిమితులుపై పవర్‌ యూజర్లు, స్వతంత్ర డెవలపర్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఇక, ఆ కంపెనీ తాజాగా ప్రకటించిన కొత్త విధానం ప్రకారం, అనుభవజ్ఞులైన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా "అడ్వాన్స్‌డ్‌ ఫ్లో" అనే కొత్త మార్గాన్ని అందించనుంది. దీని ద్వారా వారు అన్‌వెరిఫైడ్‌ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చని గూగుల్‌ తెలిపింది. అయితే, అందులో ఉన్న రిస్క్‌లను వారు స్వయంగా అంగీకరించాల్సి ఉంటుంది.

టార్గెట్ ఆడియన్స్ 

డెవలపర్లు, పవర్‌ యూజర్ల కోసం కొత్త 'అడ్వాన్స్‌డ్‌ ఫ్లో'

గూగుల్‌ ఈ కొత్త ఫీచర్‌ను ప్రత్యేకంగా డెవలపర్లు, టెక్‌ ఆసక్తి కలిగిన యూజర్ల కోసం రూపొందించింది. ఈ ఫ్లో ద్వారా వారు సురక్షిత పరిమితుల్ని అధిగమించి అన్‌వెరిఫైడ్‌ యాప్‌లను ప్రయత్నించవచ్చు. అయితే, గూగుల్‌ చెబుతున్నదేమిటంటే.. ఈ ఫ్లో పూర్తిగా భద్రతా దృష్టితో రూపుదిద్దుకుంది. వినియోగదారులను ఎవరైనా బలవంతపెట్టడం, మోసం చేయడం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఇదే కాకుండా, అన్‌వెరిఫైడ్‌ యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో స్పష్టమైన హెచ్చరికలు కూడా చూపిస్తామని గూగుల్‌ పేర్కొంది.

ధృవీకరణ చొరవ 

డెవలపర్ల వెరిఫికేషన్‌ కార్యక్రమం ప్రారంభం

అడ్వాన్స్‌డ్‌ ఫ్లోతో పాటు, ప్లే స్టోర్‌ వెలుపల యాప్‌లు విడుదల చేసే డెవలపర్ల కోసం డెవలపర్‌ వెరిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ను గూగుల్‌ ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనదలచిన వారు Android Developer Console ద్వారా తమ గుర్తింపును ముందుగానే ధృవీకరించుకోవచ్చు. ఈ చర్యలన్నీ వినియోగదారులను మోసం చేసే స్కామర్ల నుంచి రక్షించడమే లక్ష్యంగా తీసుకుంటున్నామని గూగుల్‌ తెలిపింది.

అడ్డంకి ఆందోళనలు 

హాబీ డెవలపర్లు, విద్యార్థుల కోసం ప్రత్యేక అకౌంట్లు

ఇక కొత్త వెరిఫికేషన్‌ నిబంధనలు హాబీ డెవలపర్లు, విద్యార్థి ప్రోగ్రామర్లకు అడ్డంకిగా మారవచ్చని విమర్శలు వచ్చిన నేపథ్యంలో, గూగుల్‌ వారికి ప్రత్యేక సౌకర్యం ప్రకటించింది. ఇకపై వారు "స్పెషల్‌ అకౌంట్‌" సృష్టించుకోవచ్చు. దీంట్లో వెరిఫికేషన్‌ అవసరాలు తక్కువగా ఉంటాయి, అంతేకాకుండా $25 రిజిస్ట్రేషన్‌ ఫీజు కూడా అవసరం ఉండదు. అయితే, ఈ అకౌంట్‌ ద్వారా యాప్‌లు పరిమిత పరికరాలపై మాత్రమే ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు - ప్లే స్టోర్‌ లేదా ఇతర యాప్‌ స్టోర్లలో ప్రచురించేందుకు వీలు ఉండదు.