LOADING...
Google Messages: గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌ నుంచి నేరుగా వాట్సప్‌ వీడియో కాల్‌!  
గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌ నుంచి నేరుగా వాట్సప్‌ వీడియో కాల్‌!

Google Messages: గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌ నుంచి నేరుగా వాట్సప్‌ వీడియో కాల్‌!  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2025
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ గూగుల్ మెసేజెస్ (Google Messages) మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే అనేక అధునాతన సదుపాయాలతో ఇతర మెసేజింగ్‌ యాప్‌లకు పోటీగా ముందుకెళ్తున్న ఈ సంస్థ, తాజాగా వాట్సాప్‌ (WhatsApp) వీడియో కాల్‌ నేరుగా చేసే అవకాశాన్ని అందించేందుకు సిద్ధమైంది. కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేయడానికి ఈ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. గూగుల్‌ తన మెసేజింగ్‌ యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే క్రమంలో వాట్సాప్ తరహాలో అనేక ఫీచర్లను ఎప్పటికప్పుడు జోడిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా, త్వరలో చాట్‌ సమయంలోనే స్క్రీన్‌పై వీడియో కాల్‌ ఐకాన్‌ ప్రత్యక్షమవుతుంది. ఇది పైన కుడివైపు కనిపించి, దాన్ని క్లిక్ చేస్తే నేరుగా వాట్సాప్‌ వీడియో కాల్‌ ప్రారంభించవచ్చు.

వివరాలు 

మెసేజెస్ యాప్ నుంచి వాట్సాప్‌కు

అదనంగా,గూగుల్ మెసేజెస్ యాప్ నుంచి వాట్సాప్‌కు స్విచ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఫీచర్‌ను రూపొందించింది. అయితే,యూజర్‌ వాట్సాప్‌ ఉపయోగించకపోతే,ఆ కాల్‌ నేరుగా గూగుల్‌ మీట్‌ (Google Meet) ద్వారా కొనసాగుతుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రస్తుతం ఒక్క వ్యక్తికి మాత్రమే వీడియో కాల్‌ చేయగలరు. గ్రూప్‌ కాల్స్‌కు ఈ ఫీచర్‌ ప్రస్తుతానికి అందుబాటులో లేదు.అయితే, భవిష్యత్తులో గ్రూప్‌ కాల్స్‌కు కూడా మద్దతును అందించేందుకు గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

వివరాలు 

 గూగుల్ కొత్త ఫీచర్‌  'Your Profile' 

అయితే,ఈ కొత్త ఫీచర్‌ అధికారికంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలను గూగుల్‌ ఇంకా వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో ఈ అప్డేట్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం. ఇటీవల గూగుల్ 'Your Profile' అనే మరో కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. యూజర్ల ప్రొఫైల్‌పై అదనపు నియంత్రణ కల్పించేందుకు దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.