LOADING...
Google: AI సెర్చ్‌లో నమ్మకమైన వార్తా సంస్థలను ఎంచుకునే అవకాశం.. గూగుల్ కొత్త ఫీచర్
AI సెర్చ్‌లో నమ్మకమైన వార్తా సంస్థలను ఎంచుకునే అవకాశం.. గూగుల్ కొత్త ఫీచర్

Google: AI సెర్చ్‌లో నమ్మకమైన వార్తా సంస్థలను ఎంచుకునే అవకాశం.. గూగుల్ కొత్త ఫీచర్

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ తన AI ఆధారిత సెర్చ్‌లో మరో కీలక మార్పును తీసుకొచ్చింది. "Preferred Sources" పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నమ్మకమైన వార్తా సంస్థలు, పబ్లిషర్లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. భవిష్యత్తులో ఈ Preferred Sources‌ను ర్యాంకింగ్ సిగ్నల్‌గా కూడా ఉపయోగించాలని గూగుల్ భావిస్తోంది. దీంతో యూజర్లు ఎంపిక చేసిన మీడియా సంస్థల కథనాలు AI సమాధానాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సాధారణ సెర్చ్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను ఇప్పుడు AI Overviews, AI Mode‌లలో కూడా తీసుకొస్తున్నారు. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ లింకులతో పోలిస్తే యూజర్లు తమకు నమ్మకమైన లింకులపై రెండింతలు ఎక్కువగా క్లిక్ చేస్తున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

ఒరిజినల్ ఆర్టికల్స్‌కు ప్రత్యేక క్యారసెల్

Preferred Sources ఫీచర్‌తో పాటు AI Overviews‌లో కూడా గూగుల్ పలు మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఒరిజినల్ వార్తా కథనాలను ప్రత్యేకంగా చూపించే కొత్త క్యారసెల్‌ను ప్రవేశపెట్టింది. ఇది సాధారణంగా కనిపించే "Top Stories" సెక్షన్‌లా ఉండనుంది. అయితే ఇందులో అసలైన రిపోర్టింగ్‌కు చెందిన కథనాలకే ప్రాధాన్యత ఇస్తారు. సెర్చ్ ఫలితాల్లో మరింత విశ్వసనీయ సమాచారం అందించాలన్న లక్ష్యంతో గూగుల్ ఈ మార్పులు తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన Google I/O ఈవెంట్‌లో ప్రకటించిన అప్‌డేట్లలో ఇదీ ఒకటి.

వివరాలు 

'Highly Cited' లేబుల్ విస్తరణ

విస్తృతంగా ప్రస్తావించబడిన వార్తా కథనాలను యూజర్లు త్వరగా గుర్తించేందుకు "Highly Cited" లేబుల్‌ను కూడా గూగుల్ విస్తరిస్తోంది. ఒక కథనం Highly Cited సోర్స్‌ను రిఫర్ చేస్తే దానిని కూడా స్పష్టంగా చూపించనుంది. యూజర్లకు ప్రభావవంతమైన, ఎక్కువగా చర్చకు వచ్చిన కథనాలను సులభంగా చేరవేయడమే గూగుల్ లక్ష్యంగా కనిపిస్తోంది.

Advertisement