LOADING...
Google AI: గూగుల్ కొత్త AI: శాస్త్రీయ పేపర్లను చదవడం,విశ్లేషించడం ఇప్పుడు మరింత సులువు
గూగుల్ కొత్త AI: శాస్త్రీయ పేపర్లను చదవడం,విశ్లేషించడం ఇప్పుడు మరింత సులువు

Google AI: గూగుల్ కొత్త AI: శాస్త్రీయ పేపర్లను చదవడం,విశ్లేషించడం ఇప్పుడు మరింత సులువు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ తాజాగా "స్కాలర్ లాబ్స్" అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్‌ను విడుదల చేసింది. శోధన చేస్తున్న వారికి అవసరమైన శాస్త్రీయ పత్రాలను త్వరగా, సులభంగా గుర్తించడంలో ఈ టూల్ ఉపయోగపడుతోంది. యూజర్ అడిగిన ప్రశ్నలోని ప్రధాన అంశాలు, వాటి మధ్య ఉన్న సంబంధాలను AI పరిశీలించి ఫలితాలు చూపుతుంది. ప్రస్తుతం ఇది కొద్దిమంది లాగిన్ అయిన యూజర్లకే అందుబాటులో ఉంది. అయితే, సాంప్రదాయంగా ఉపయోగించే మెట్రిక్స్ లేకుండానే "మంచి" పరిశోధన పత్రాలను గుర్తించే ఈ టూల్ సామర్థ్యం కొంతమంది శాస్త్రవేత్తల్లో ఆందోళనలు కలిగిస్తోంది.

ఆపరేషన్

స్కాలర్ లాబ్స్ ఎలా పనిచేస్తుంది?

డెమోలో, బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ (BCIs) గురించి ఒక ప్రశ్నతో స్కాలర్ లాబ్స్‌ని పరీక్షించారు. మొదటి ఫలితంగా 2024లో Applied Sciences జర్నల్‌లో ప్రచురించిన BCI పరిశోధనపై రివ్యూ పేపర్‌ను చూపించింది. ఈ పత్రం ఎందుకు సంబంధితమో కూడా టూల్ వివరించింది... వాటిలో నాన్-ఇన్వేసివ్ సిగ్నల్స్ (EEG వంటి) గురించి సమాచారాన్ని, రంగంలో ఉపయోగించే కొన్ని ప్రముఖ ఆల్గోరిథమ్స్‌ను విశదీకరించింది.

వివరణ

స్కాలర్ ల్యాబ్స్ విధానంపై Google వైఖరి 

గూగుల్ ప్రతినిధి లీసా ఓగ్వైక్ చెప్పినదాని ప్రకారం, స్కాలర్ లాబ్స్ లక్ష్యం.. "యూజర్ శోధనలో వారికి నిజంగా ఉపయోగపడే పత్రాలను బయటకు తీయడం". ఇందుకోసం పరిశోధకుల్లా పేపర్లను అంచనా వేసే విధానాన్ని AI అనుసరిస్తుందని అన్నారు. పత్రంలోని టెక్స్ట్, అది ప్రచురితమైన జర్నల్, రచయితలు, ఇతర పరిశోధనల్లో వచ్చిన సైటేషన్ల సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. అయితే, పేపర్‌కి వచ్చిన సైటేషన్ల సంఖ్య లేదా జర్నల్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఫలితాలను ఫిల్టర్ చేయబోదని కూడా స్పష్టం చేశారు.

విమర్శ

మెట్రిక్స్ లేకపోవడంపై విమర్శలు

స్కాలర్ లాబ్స్‌లో సాధారణంగా పరిశోధన విలువను అంచనా వేయడానికి ఉపయోగించే మెట్రిక్స్ లేకపోవడంపై శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నారు. గూగుల్ స్కాలర్‌లో యూజర్లు "సంబంధితత" ప్రకారం ఫలితాలు చూడవచ్చు, ప్రతి పేపర్‌కు ఎన్ని సైటేషన్లు వచ్చాయో తెలుస్తుంది. కానీ స్కాలర్ లాబ్స్‌లో ఈ విధంగా సార్టింగ్ ఆప్షన్ లేదు. దీంతో "మంచి పేపర్లు - అంతగా మంచికాని పేపర్లు" మధ్య తేడా స్పష్టంగా కనిపించకపోవచ్చని కొందరు భావిస్తున్నారు.

భవిష్యత్తు అవకాశాలు 

పరిశోధన రంగంలో స్కాలర్ లాబ్స్ ప్రభావం

విమర్శలున్నప్పటికీ, AI ఆధారిత శోధన సాధనాలు భవిష్యత్తులో పరిశోధన రంగానికి ఉపయోగపడతాయని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ మాథ్యూ శ్రాగ్ అభిప్రాయంలో.. ఇలాంటి టూల్స్ సాధారణంగా కనిపించకుండా పోయే పేపర్లను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. పత్రాలను మొత్తం దృష్టిలో పెట్టుకొని అంచనా వేయడం AI వల్ల సాధ్యమవుతుందని కూడా ఆయన సూచించారు.