LOADING...
Venezuela Earthquakes: వెనెజువెలాలో భూకంపాలు.. క్షణాల ముందే హెచ్చరించిన గూగుల్.. ఎలా గుర్తించిందంటే..?
ఎలా గుర్తించిందంటే..?

Venezuela Earthquakes: వెనెజువెలాలో భూకంపాలు.. క్షణాల ముందే హెచ్చరించిన గూగుల్.. ఎలా గుర్తించిందంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెనిజులా ప్రస్తుతం వందేళ్లలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది. వరుసగా సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాల ప్రభావంతో అనేక భవనాలు కూలిపోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఈ భూకంపాలు సంభవించడానికి కొన్ని క్షణాల ముందే గూగుల్ పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు హెచ్చరికలు పంపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ అలర్ట్‌లు అందాయని, కొద్దిసేపటికే భూకంపాలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. అసలు భూకంపాన్ని గూగుల్ ముందుగానే ఎలా గుర్తించగలిగిందనే ఆసక్తి అందరిలో నెలకొంది.

వివరాలు 

యాక్సిలరోమీటర్‌తో ప్రకంపనల గుర్తింపు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక స్మార్ట్‌ఫోన్లలో యాక్సిలరోమీటర్ అనే సెన్సార్ ఉంటుంది. సాధారణంగా ఫోన్‌ను అడ్డంగా లేదా నిలువుగా తిప్పినప్పుడు స్క్రీన్ ఆటోమేటిక్‌గా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇదే సెన్సార్ భూమిలో ఏర్పడే స్వల్ప ప్రకంపనలను కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. భూమి నుంచి వచ్చే అసాధారణ కంపనాలను ఇది నమోదు చేస్తుంది. అవి భూకంపానికి సంకేతాలుగా అనిపిస్తే వెంటనే గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్‌కు సమాచారం పంపుతుంది. దీంతో భూకంపం సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాన్ని సిస్టమ్ అంచనా వేస్తుంది.

వివరాలు 

200 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్

ఒక ఫోన్ నుంచి ఈ సంకేతం అందిన వెంటనే గూగుల్ సర్వర్లు అదే ప్రాంతంలోని ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ల యాక్సిలరోమీటర్‌ల నుంచి కూడా సమాచారం సేకరిస్తాయి. ఒకేసారి అనేక ఫోన్లు ఒకే తరహా ప్రకంపనలను నమోదు చేస్తే భూకంపం సంభవించే అవకాశాన్ని నిర్ధారించి వెంటనే ఆ ప్రాంత ప్రజలకు అలర్ట్‌లు పంపిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ కొన్ని క్షణాల్లోనే పూర్తవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్లు గూగుల్ వెల్లడించింది.

Advertisement

వివరాలు 

భూకంపానికి ముందే హెచ్చరిక ఎలా సాధ్యం?

భూకంపం ఒక్కసారిగా సంభవించదు.ఇది తరంగాల రూపంలో వ్యాపిస్తుంది. మొదట ప్రైమరీ (P) వేవ్స్ ఏర్పడతాయి. ఇవి సెకనుకు సుమారు ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఆ తర్వాత సెకండరీ (S) వేవ్స్ వస్తాయి. ఇవి సెకనుకు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వేగంతో కదులుతాయి. భూకంపాల సమయంలో ఎక్కువ నష్టం కలిగించేవి ఈ సెకండరీ వేవ్స్‌నే. స్మార్ట్‌ఫోన్లలోని యాక్సిలరోమీటర్లు ముందుగా ప్రైమరీ వేవ్స్‌ను గుర్తిస్తాయి. వెంటనే ఆ సమాచారాన్ని గూగుల్ సర్వర్లకు పంపిస్తాయి.దీంతో సెకండరీ వేవ్స్ చేరుకునేలోపు సమాచారం విశ్లేషించి ప్రమాద ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు హెచ్చరికలు పంపేందుకు గూగుల్‌కు కొంత సమయం లభిస్తుంది. అందుకే భూకంపం సంభవించే కొన్ని క్షణాల ముందే అలర్ట్‌లు అందే అవకాశం ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

ఆండ్రాయిడ్‌లో రెండు రకాల భూకంప అలర్ట్‌లు

భూకంప తీవ్రతను బట్టి ఆండ్రాయిడ్ ఫోన్లు రెండు రకాల హెచ్చరికలను జారీ చేస్తాయి. 'బి అవేర్ అలర్ట్' - తక్కువ తీవ్రతతో ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నప్పుడు ఈ హెచ్చరిక వస్తుంది. 'టేక్ యాక్షన్ అలర్ట్' - మధ్యస్థ లేదా తీవ్రమైన భూకంపం వచ్చే అవకాశమున్నప్పుడు ఈ అలర్ట్ జారీ అవుతుంది. దీనిపై ట్యాప్ చేస్తే భూకంప ప్రభావం ఉండే ప్రాంతాన్ని మ్యాప్‌లో చూపిస్తుంది. అలాగే విపత్తు సమయంలో ఎలా సురక్షితంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలను కూడా అందిస్తుంది.

వివరాలు 

భారత్‌లోనూ ఈ ఫీచర్..

భారత్‌లో 2023 నుంచే ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్ అమల్లో ఉంది. ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే కొత్త వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. అయితే భూకంప హెచ్చరికలు అందాలంటే మొబైల్ డేటా లేదా వై-ఫై తప్పనిసరిగా ఆన్‌లో ఉండాలి. ఈ అలర్ట్‌లు అవసరం లేదనుకునే వారు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Earthquake Alerts లేదా Emergency Alerts ఎంపికను ఆఫ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

Advertisement