Google Veo AI: గూగుల్ Veo AIతో ఇక 4K వెర్టికల్ వీడియోలు
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన Veo 3.1 ఏఐ వీడియో మోడల్‌ను తాజాగా అప్‌డేట్ చేసింది. ఇందులో భాగంగా "Ingredients to Video" టూల్‌కు కొత్త విజువల్ మెరుగుదలలు జోడించింది. ఈ అప్‌డేట్‌తో యూజర్లు రిఫరెన్స్ ఇమేజెస్‌ను ఉపయోగించి సోషల్ మీడియాకు సరిపోయే నేటివ్ వెర్టికల్ వీడియోలను రూపొందించుకోవచ్చు. దీంతో ఇమేజెస్ ఆధారంగా తయారయ్యే వీడియోలు మరింత డైనమిక్‌గా, ఎక్స్‌ప్రెసివ్‌గా మారనున్నాయి.
వివరాలు
వీడియో జనరేషన్‌లో కొత్త సామర్థ్యాలు
కొత్త Veo 3.1 మోడల్‌లో గరిష్టంగా మూడు రిఫరెన్స్ ఇమేజెస్‌తో వీడియోలు క్రియేట్ చేసే అవకాశం కల్పించింది. వీటిలో క్యారెక్టర్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌లు, టెక్స్చర్స్ వంటివి ఉండొచ్చు. దీంతో ఫైనల్ అవుట్‌పుట్‌పై యూజర్లకు మరింత కంట్రోల్ లభిస్తుంది. ఈ అప్‌డేట్‌తో వీడియోలు "మరింత క్రియేటివ్‌గా, భావప్రధానంగా" ఉండటమే కాకుండా, డైలాగ్స్, స్టోరీ టెల్లింగ్ కూడా బాగా మెరుగుపడతాయని గూగుల్ చెబుతోంది. అలాగే ఒకే క్యారెక్టర్ వివిధ క్లిప్స్‌లో, వేర్వేరు వాతావరణాల్లోనూ ఒకేలా కనిపించేలా కన్సిస్టెన్సీని మెరుగుపరిచింది.
వివరాలు
వెర్టికల్ వీడియో సపోర్ట్, 4K అప్‌స్కేలింగ్
ఈ అప్‌డేట్‌లో మరో ముఖ్యమైన అంశం వెర్టికల్ వీడియో సపోర్ట్. ఇప్పుడు 9:16 ఆస్పెక్ట్ రేషియోలో నేరుగా వీడియోలు తయారు చేయొచ్చు. ఇది టిక్‌టాక్, యూట్యూబ్ షార్ట్స్ వంటి ప్లాట్‌ఫాంలకు చాలా ఉపయోగపడనుంది. అంతేకాదు, ఇప్పటివరకు 1080p వరకే పరిమితమైన వీడియోలను ఇప్పుడు 4K రిజల్యూషన్‌కు అప్‌స్కేల్ చేసే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. 1080p వీడియోల నాణ్యతను కూడా మరింత షార్ప్‌గా, క్లీన్గా మార్చామని గూగుల్ వెల్లడించింది.
వివరాలు
జెమినీ యాప్, యూట్యూబ్‌తో ఇంటిగ్రేషన్
Veoలో మెరుగైన "Ingredients to Video" ఫీచర్‌తో పాటు పోర్ట్రైట్ మోడ్‌ను గూగుల్ జెమినీ యాప్‌లోకి తీసుకొస్తోంది. అలాగే తొలిసారి ఈ టూల్స్‌ను యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ క్రియేట్ యాప్‌లలోనూ ఇంటిగ్రేట్ చేస్తోంది. దీని వల్ల యూజర్లు నేరుగా పాపులర్ ప్లాట్‌ఫాంల నుంచే అడ్వాన్స్‌డ్ వీడియో జనరేషన్ ఫీచర్లను ఉపయోగించుకునే వీలు కలగనుంది. ఇది మొత్తం వీడియో క్రియేషన్ అనుభవాన్ని మరింత సులభంగా, ఆకర్షణీయంగా మార్చనుంది.