NASA: లూనార్ రెస్క్యూ సిస్టమ్‌ను డెవలప్ చేసేవారికి.. 20వేల డాలర్ల నజరానా ప్రకటించిన నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) త్వరలో చంద్రుడిపై యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ లక్ష్యానికి చేరుకోవడానికి నాసా ప్రణాళికలను మరింత ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా, లూనార్ రెస్క్యూ సిస్టమ్ అభివృద్ధి కోసం ఐడియాలు అందించే వారికి 20,000 డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.16 లక్షల) నగదు బహుమతిని ప్రకటించింది. చంద్రుడిపై వ్యోమగాములు చిక్కుకున్న పరిస్థితుల్లో, వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో సహాయపడే సమర్థవంతమైన డిజైన్లను అందించేందుకు నాసా ఆహ్వానం పలుకుతోంది.
చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ తక్కువ
ఈ డిజైన్లను సమర్పించేందుకు ఆసక్తి గల ఔత్సాహికులు వచ్చే ఏడాది జనవరి 23లోపు HeroX పోర్టల్‌లో తమ ఐడియాలను పంపించాలని నాసా సూచించింది. చంద్రుడి ఉపరితలంపై గాయాలు,మెడికల్ ఎమర్జెన్సీలు లేదా మిషన్ సంబంధిత ప్రమాదాలు సంభవించినప్పుడు,వ్యోమగాములు ఆపదలో పడే అవకాశముంది. అప్పుడు,తోటి క్రూ సభ్యులు లూనార్ ల్యాండర్ వద్దకు వారిని కదిలించాల్సిన అవసరం వస్తుంది. రోవర్ సహాయం లేకుండా,స్పేస్ సూట్ ధరించిన వ్యోమగాములను రెండు కిలోమీటర్ల వరకు తరలించగల సామర్థ్యాన్ని కలిగిన డిజైన్‌ను అభివృద్ధి చేయాలని నాసా కోరుతోంది. చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం వల్ల వ్యోమగాముల శరీర బరువు తేలికగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
026లో మానవసహిత ఆర్టెమిస్-3
అయినప్పటికీ, వారిని ఒక చోటు నుండి మరొక చోటుకు తరలించడం సవాల్‌గా మారుతుంది. అందుకే నాసా సాంకేతిక పరిష్కారాలపై దృష్టి పెట్టింది. నాసా చంద్రయాన్ మిషన్‌ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో, రెండు సంవత్సరాల క్రితం మానవ రహిత ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. దీని తరువాత, 2025లో ఆర్టెమిస్-2 మిషన్‌ను, 2026లో మానవసహిత ఆర్టెమిస్-3 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది.