LOADING...
External Hard Drives: నకిలీ హార్డ్‌డిస్క్‌లపై కేంద్రం కఠిన చర్యలు.. BIS భద్రతా ప్రమాణాలు తప్పనిసరి

External Hard Drives: నకిలీ హార్డ్‌డిస్క్‌లపై కేంద్రం కఠిన చర్యలు.. BIS భద్రతా ప్రమాణాలు తప్పనిసరి

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో నకిలీ ఉత్పత్తులకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. స్టాండలోన్ ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్ డ్రైవ్‌లు(HDDs)పై భద్రతా నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ(MeitY) ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గూడ్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆర్డర్-2021లో సవరణలు చేసింది. ఇకపై స్టాండలోన్ హార్డ్‌డిస్క్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇప్పటికే USB తరహా ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌లపై ఈ నిబంధనలు అమల్లో ఉండగా.. మిగతా స్టాండలోన్ డ్రైవ్‌లకు 2026 నవంబర్ 5 నుంచి కొత్త నిబంధనలు వర్తించనున్నాయి.

వివరాలు 

నకిలీ ఉత్పత్తులను అరికట్టేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించిన ఇండస్ట్రీ ప్రతినిధులు 

ప్రభుత్వ వర్గాల ప్రకారం.. మార్కెట్లో రీఫర్బిష్డ్, డూప్లికేట్ హార్డ్‌డిస్క్‌లు భారీగా అమ్ముడవుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా బయట షాపుల్లో అమ్మే ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్‌లు అసలైనవేనా అన్న అనుమానాలు పెరిగాయి. అయితే ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో అమర్చే ఇంటర్నల్ హార్డ్‌డిస్క్‌ల విషయంలో పెద్దగా సమస్యలు లేవని అధికారులు చెబుతున్నారు. నకిలీ ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని ఇండస్ట్రీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.

వివరాలు 

ఎలక్ట్రానిక్ పరికరాల నాణ్యత, భద్రతపై కేంద్రం కీలక అడుగు

కొత్త నిబంధనల ప్రకారం అన్ని స్టాండలోన్ హార్డ్‌డిస్క్‌లు IS 13252 (Part 1): 2010 భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎలక్ట్రానిక్ పరికరాల నాణ్యత, భద్రతపై కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో ఇది మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇటీవల చైనా కంపెనీల CCTV కెమెరాల విక్రయాలపై కూడా కేంద్రం కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. STQC అనుమతులు లభించకపోవడంతో చైనా కంపెనీల IP కెమెరాల అమ్మకాలపై ప్రభావం పడింది.

Advertisement