Loading...
'Scam Se Bacho': ఆన్‌లైన్ మోసాలపై కేంద్రం కొత్త ప్రచారం.. మెటాతో కలిసి మైక్రోడ్రామా సిరీస్
ఆన్‌లైన్ మోసాలపై కేంద్రం కొత్త ప్రచారం.. మెటాతో కలిసి మైక్రోడ్రామా సిరీస్

'Scam Se Bacho': ఆన్‌లైన్ మోసాలపై కేంద్రం కొత్త ప్రచారం.. మెటాతో కలిసి మైక్రోడ్రామా సిరీస్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇందుకోసం సోషల్ మీడియా దిగ్గజం మెటాతో కలిసి ప్రత్యేక మైక్రోడ్రామా సిరీస్‌ను ప్రారంభించనుంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB), ప్రసార భారతి, భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (SEBI), ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. నవంబర్ 19న ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. తొలుత ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సిరీస్‌ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ప్రసార భారతి ఓటీటీ వేదిక 'వేవ్స్‌' (Waves OTT)లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

వివరాలు 

చిన్నచిన్న కథల ద్వారా ఆన్‌లైన్ మోసాల గురించి వివరణ 

'స్కామ్ సే బచో' (Scam Se Bacho) పేరుతో రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో చిన్నచిన్న కథల ద్వారా ఆన్‌లైన్ మోసాల గురించి వివరించనున్నారు.

నకిలీ ఉద్యోగ ఆఫర్లు, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల వంటి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలను గుర్తించడం, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సమాచారాన్ని ధ్రువీకరించుకోవడం, సైబర్ మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయడం వంటి విషయాలను తెలియజేయనున్నారు.

ఇందుకోసం జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలని సూచించనున్నారు.

వివరాలు 

మైక్రోడ్రామాలతో మరింత విస్తృతంగా అవగాహన ప్రచారం

ఇప్పటికే మెటా ప్రభుత్వ సంస్థలతో కలిసి 'స్కామ్ సే బచో' పేరుతో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

అవగాహన చిత్రాలు, కంటెంట్ క్రియేటర్ల ద్వారా రూపొందించిన వీడియోలు, విద్యా కార్యక్రమాల రూపంలో ఈ ప్రచారాన్ని కొనసాగిస్తోంది.

ఇప్పుడు మైక్రోడ్రామాల ద్వారా ఈ ప్రయత్నాలను మరింత విస్తరించనుంది.

మొబైల్ ఫోన్లలో చిన్నచిన్న వీడియోలు చూసే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త విధానాన్ని ఎంచుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

క్రియేటర్లకు ప్రోత్సాహం.. పెట్టుబడిదారులకు అవగాహన

ఈ భాగస్వామ్యంతో భారత్‌లో అభివృద్ధి చెందుతున్న కంటెంట్ క్రియేటర్ల రంగానికి కూడా ప్రోత్సాహం లభిస్తుందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది తెలిపారు.

కొత్త తరహా కథనాలకు అవకాశాలు కల్పించడంతో పాటు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని మైక్రోడ్రామాల ద్వారా ప్రజలకు చేరవేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఇందుకోసం ప్రభుత్వ సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, పరిశ్రమలకు చెందిన భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

మారుతున్న ఆర్థిక మోసాలపై పెట్టుబడిదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ సి. పురావ్ అన్నారు.

సెబీ ఇప్పటికే నిర్వహిస్తున్న 'సమజ్ సే ఇన్వెస్టింగ్ సింపుల్' ప్రచారానికి ఈ కార్యక్రమం మరింత తోడ్పడుతుందని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలను గుర్తించడం, పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సమాచారాన్ని సరిచూసుకోవడం వంటి విషయాలను ఈ సిరీస్ ద్వారా వివరించనున్నట్లు చెప్పారు.

సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఐ4సీ డైరెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.

ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.

ఈ తరహా మోసాల్లో నేరగాళ్లు పోలీసు లేదా ఇతర దర్యాప్తు సంస్థల అధికారులుగా నటిస్తారని వివరించారు.

కేసులు నమోదు చేస్తామని, అరెస్ట్ చేస్తామని బెదిరించి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు.

ఇలాంటి మోసాల హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించి, బాధితులు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

వివరాలు 

మోసాలను గుర్తించేలా కథల రూపంలో అవగాహన

మెటా ఇండియా పబ్లిక్ పాలసీ విభాగం సీనియర్ డైరెక్టర్, హెడ్ అమన్ జైన్ మాట్లాడుతూ.. సంస్థ గతంలో నిర్వహించిన 'స్కామ్ సే బచో' ప్రచారంలోని మూడు విడతలకు కొనసాగింపుగా ఈ మైక్రోడ్రామా సిరీస్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు.

రోజువారీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను కథల రూపంలో చూపించడం వల్ల ప్రజలు మోసాలను సులభంగా గుర్తించగలరని చెప్పారు.

అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినప్పుడు తొందరపడకుండా ఆగి, వివరాలను ధ్రువీకరించుకుని, అవసరమైతే ఫిర్యాదు చేయాలని సూచించారు.

వివరాలు 

వృద్ధుల కోసం ప్రత్యేక సైబర్ భద్రతా అవగాహన కార్యక్రమాలు

ఈ సిరీస్‌తో పాటు పెట్టుబడుల మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై అవగాహన కల్పించే కామిక్ స్ట్రిప్‌ను కూడా మెటా విడుదల చేసింది.

ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను గుర్తించడం, అందుబాటులో ఉన్న భద్రతా సాధనాలను ఉపయోగించడం ద్వారా మోసాల బారిన పడకుండా ఉండటమే దీని లక్ష్యం.

గత నెలలోనూ మెటా, ఐ4సీ, సక్షమ్ సీనియర్ సంస్థలు కలిసి వృద్ధుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాయి.

కొత్త తరహా సైబర్ మోసాలను గుర్తించేలా వృద్ధులకు అవగాహన కల్పించడంతో పాటు కుటుంబ సభ్యులు, సమాజంలో సైబర్ భద్రతపై చైతన్యం పెంచేందుకు ఈ కార్యక్రమాలను రూపొందించాయి.

ADVERTISEMENT