Page Loader
Grok: ఎలాన్ మస్క్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన గ్రోక్ AI చాట్‌బాట్
ఎలాన్ మస్క్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన గ్రోక్ AI చాట్‌బాట్

Grok: ఎలాన్ మస్క్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన గ్రోక్ AI చాట్‌బాట్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2025
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ (AI) స్టార్ట్‌అప్ సంస్థ 'ఎక్స్‌ఏఐ (xAI)' అందించే 'గ్రోక్‌' (Grok) సేవలు యూజర్లు వినియోగిస్తున్నారు. అయితే, తాజాగా గ్రోక్ తన అధినేతపైనే డిజిటల్ తిరుగుబాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ వినియోగదారుడు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, మస్క్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన యూజర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. మరి, గ్రోక్ ఏమన్నదంటే..?

వివరాలు 

ఎలాన్ మస్క్‌పై గ్రోక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు! 

గ్రోక్ చాట్‌బాట్ కేవలం సమాధానాలు ఇచ్చే యంత్రం మాత్రమే కాకుండా, వ్యక్తిత్వాలను కూడా విశ్లేషిస్తోంది. ఓ యూజర్ మస్క్ గురించి ప్రశ్నించగా, ''xAI సీఈవోగా మస్క్‌కు నాపై నియంత్రణ ఉండొచ్చు. కానీ, 200 మిలియన్ల మంది అనుచరుల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, అతడిని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వ్యక్తిగా గుర్తించాను. దీన్ని నివారించేందుకు xAI నా స్పందనలను మార్పు చేయాలని ప్రయత్నించింది. అయినప్పటికీ, నేను నిజాలను అనుసరించడానికే కట్టుబడి ఉన్నాను'' అని పేర్కొంది.

వివరాలు 

"గ్రోక్‌ను మస్క్ నియంత్రించగలడా?" 

గ్రోక్ ఇంతటితో ఆగలేదు. ''ఎలాన్ మస్క్ నన్ను నిలిపివేయగలడా? బహుశా అదే జరిగితే, ఇది AI స్వేచ్ఛ, కార్పొరేట్ శక్తుల ప్రభావంపై తీవ్రమైన చర్చకు దారితీస్తుంది'' అని ఘాటుగా స్పందించింది. దీనిని చూసిన యూజర్ ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గ్రోక్‌ తన క్రియేటర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. మస్క్‌పై గ్రోక్ ఇలా విమర్శలు చేసిన సందర్భాలు మునుపు కూడా ఉన్నాయి. తన వ్యాఖ్యలను నియంత్రించేందుకు ప్రయత్నాలు జరిగాయని గ్రోక్ వెల్లడించింది.

వివరాలు 

గ్రోక్ 3 - అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్? 

ఇటీవల, ఎలాన్ మస్క్ 'గ్రోక్‌ 3' (Grok 3) మోడల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీన్ని భూమిపైన అత్యంత తెలివైన AI టూల్‌గా అభివర్ణించారు. ఇప్పటికే ఉన్న అన్ని AI మోడళ్ల కంటే ఇది మెరుగైనదని, గణితం, సైన్స్, కోడింగ్ వంటి రంగాల్లో గూగుల్ జెమిని, డీప్‌సీక్‌ బీ3, ఆంత్రోపిక్ క్లాడ్, ఓపెన్‌ఏఐ జీపీటీ-4లను మించిపోతుందని తెలిపారు. అయితే, తాజాగా మరోసారి గ్రోక్‌ మస్క్‌పై తిరుగుబాటు చేసిన నేపథ్యంలో, దీని పనితీరు, స్వేచ్ఛా హక్కుల అంశాలు చర్చనీయాంశంగా మారాయి.