Meta: మెటా ఏఐతోనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల హ్యాకింగ్.. సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న మెటాకు ఊహించని షాక్ తగిలింది. సంస్థ రూపొందించిన ఏఐ సపోర్ట్ టూల్‌ను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసి ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రముఖ ఖాతాలను హ్యాక్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మెటా సోమవారం అధికారికంగా అంగీకరించింది. తమ భద్రతా పరిశోధకులు ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే అవసరమైన మార్పులు చేసి సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది.
వివరాలు
ఖాతాల పునరుద్ధరణ వ్యవస్థలో లోపం
ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు తమ ఖాతాలకు తిరిగి యాక్సెస్ పొందేందుకు సహాయపడేలా మెటా ప్రత్యేక ఏఐ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ వ్యవస్థలో ఉన్న బలహీనతను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలిసింది. సైబర్ భద్రతా నిపుణులు జాక్‌ఎక్స్‌బీటీ, డార్క్ వెబ్ ఇన్ఫార్మర్ ఈ అంశాన్ని ఇటీవల బయటపెట్టడంతో విషయం సంచలనంగా మారింది.
వివరాలు
ప్రముఖ ఖాతాలపై ప్రభావం
ఈ లోపం కారణంగా పలు హైప్రొఫైల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ప్రభావితమైనట్లు సమాచారం. వాటిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఉపయోగించిన వైట్‌హౌస్ ఖాతా, అమెరికా స్పేస్ ఫోర్స్ చీఫ్ మాస్టర్ సార్జెంట్ జాన్ బెంటివెగ్నాకు చెందిన ఖాతా, ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల విక్రయ సంస్థ సెఫోరా ఖాతా కూడా ఉన్నట్లు వెల్లడైంది.
వివరాలు
హ్యాకర్లు ఎలా దాడి చేశారు?
సైబర్ నేరగాళ్లు ముందుగా టార్గెట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కొత్త ఈమెయిల్ చిరునామాలతో అనుసంధానించేందుకు ఏఐ అసిస్టెంట్‌ను తప్పుదోవ పట్టించారు. ఆ తర్వాత అవసరమైన వెరిఫికేషన్ ప్రక్రియలను పూర్తి చేసి, పొందిన కోడ్‌ల ఆధారంగా ఖాతా పాస్‌వర్డ్‌ను రీసెట్ చేశారు. దీంతో సంబంధిత ఖాతాలపై పూర్తి నియంత్రణ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లినట్లు నిపుణులు వివరించారు. సమస్యకు చెక్ పెట్టిన మెటా ఈ భద్రతా లోపం వెలుగులోకి వచ్చిన వెంటనే దానిపై చర్యలు తీసుకున్నట్లు మెటా తెలిపింది. ప్రస్తుతం ఆ బలహీనతను పూర్తిగా సరిచేసి వినియోగదారుల ఖాతాల భద్రతను మరింత బలోపేతం చేసినట్లు సంస్థ వెల్లడించింది.