AI framework: ఏఐపై కేంద్రం తొలి సమగ్ర మార్గదర్శకాలు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఐదు రోజుల పాటు జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026కు ముందుగా కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ)కు సంబంధించి తొలి సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త చట్టం తీసుకురాకుండానే, ఇప్పటికే ఉన్న చట్టాలు, సూత్రాల ఆధారంగా ఏఐ వాడకంలో రిస్కులు, పక్షపాతం, దుర్వినియోగాన్ని అడ్డుకునేలా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. ఇన్నోవేషన్‌కు అడ్డుకాకుండా భద్రతలు ఉండాలన్న ఉద్దేశంతో రూపొందించిన ఈ మార్గదర్శకాలు ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఆర్థిక రంగం, పాలన వంటి కీలక విభాగాల్లో ఏఐ ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా ఉపయోగించాలన్నదాన్ని వివరిస్తున్నాయి. విశ్వాసమే పునాది, ప్రజలే కేంద్రం, నియంత్రణకన్నా నూతనత, న్యాయం-సమానత్వం, బాధ్యత, అర్థమయ్యేలా రూపకల్పన, భద్రత-స్థిరత్వం వంటి ఏడు సూత్రాలపై ఈ విధానం ఆధారపడి ఉంది.
వివరాలు
ఏఐ చట్టం కాకుండా, టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా సమీక్షలు
ఏఐ నిర్ణయాలు మనుషుల నిర్ణయాలకు తోడ్పడేలా ఉండాలి, వివక్షకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలి అన్నదే ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. ఇప్పటికే ఐటీ నిబంధనలు, డేటా పరిరక్షణ చట్టాలు, క్రిమినల్ చట్టాల ద్వారా అనేక ఏఐ రిస్కులు కవర్ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రత్యేక ఏఐ చట్టం కాకుండా, టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా సమీక్షలు, అవసరమైన సవరణలకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఏఐ పాలన కోసం జాతీయ స్థాయి సంస్థల ఏర్పాటు కూడా ప్రతిపాదించారు. మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి ఏఐ గవర్నెన్స్ గ్రూప్, నిపుణుల సలహాల కోసం టెక్నాలజీ-పాలసీ కమిటీ, భద్రతా ప్రమాణాలు, రిస్క్ అంచనాలపై పనిచేసే ఏఐ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు సూచనలు ఉన్నాయి.
వివరాలు
ఏఐ వినియోగాలకు మానవ పర్యవేక్షణతో కఠిన భద్రతలు
ఏఐ రూపొందించే వారు, వినియోగించే వారిపై పారదర్శక నివేదికలు, ఏఐతో తయారైన కంటెంట్‌కు స్పష్టమైన ప్రకటనలు, బాధితుల కోసం ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలు ఉండాలని కూడా మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. భద్రత, హక్కులు, ఉపాధిపై ప్రభావం చూపే హైరిస్క్ ఏఐ వినియోగాలకు మానవ పర్యవేక్షణతో కఠిన భద్రతలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఏఐ కొద్దిమంది కంపెనీలకే పరిమితం కాకుండా, ప్రజలకు ఉపయోగపడేలా విస్తృతంగా వినియోగంలోకి రావాలన్నదే భారత దృష్టికోణమని పేర్కొంటూ, ఇన్నోవేషన్‌తో పాటు భద్రతల మధ్య సమతౌల్యంతో 'విక్సిత్ భారత్-2047' లక్ష్యానికి అనుగుణంగా బాధ్యతాయుత ఏఐ పాలనలో భారత్ ప్రపంచానికి దారితీసే స్థాయికి చేరాలన్న ఆశాభావాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది.