HPV Vaccine: ఒక్క టీకాతో క్యాన్సర్‌కు చెక్.. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై సంచలన అధ్యయనం
ఈ వార్తాకథనం ఏంటి
బాలికలకు చిన్న వయసులో ఇచ్చే హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను దాదాపు పూర్తిగా అడ్డుకుంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది. 12 నుంచి 13 ఏళ్ల వయసులో ఈ టీకా తీసుకున్న యువతులు 30 ఏళ్లలోపు గర్భాశయ క్యాన్సర్‌తో మరణించే ప్రమాదం దాదాపు శూన్యానికి చేరుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇంగ్లాండ్‌లో 2008 నుంచి పాఠశాల విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకా ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి గర్భాశయ క్యాన్సర్ మరణాలు గణనీయంగా తగ్గాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇప్పటివరకు ఈ టీకా వల్ల దాదాపు 200 మంది ప్రాణాలు కాపాడినట్లు పరిశోధకులు అంచనా వేశారు.
వివరాలు
ఐదేళ్లలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు
2020 నుంచి 2024 మధ్య 20 నుంచి 24 ఏళ్ల వయసు మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. టీకా లేకపోయి ఉంటే ఇదే కాలంలో కనీసం 23 మరణాలు సంభవించి ఉండేవని అధ్యయనం తెలిపింది. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పీటర్ ససియేని మాట్లాడుతూ.. "ఒకే ఒక్క టీకా ఒక రకమైన క్యాన్సర్‌ను దాదాపు నిర్మూలించే స్థాయికి తీసుకెళ్లడం గొప్ప విజయమని" పేర్కొన్నారు.
వివరాలు
హెచ్‌పీవీ వైరస్ వల్లే 99 శాతం కేసులు
బ్రిటన్‌లో ప్రతి ఏడాది సుమారు 3,300 మందికి గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ అవుతోంది. వీటిలో దాదాపు 99 శాతం కేసులకు హెచ్‌పీవీ వైరస్ కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ చర్మం ద్వారా సన్నిహిత సంబంధాల వల్ల వ్యాపిస్తుంది. చాలామందిలో ఇది ఎలాంటి సమస్యలు కలిగించకుండా తగ్గిపోతుంది. అయితే కొందరిలో కణాల్లో మార్పులు వచ్చి, కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది.
వివరాలు
టీకా తీసుకోకపోవడంతో జీవితంలో కష్టాలు ఎదుర్కొన్న మహిళ
ఇంగ్లాండ్‌కు చెందిన అలెగ్జాండ్రా లెగ్‌కు హెచ్‌పీవీ టీకా అందుబాటులోకి రాకముందే పాఠశాల విద్య పూర్తైంది. 2021లో తన వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో,30ఏళ్ల వయసులో ఆమెకు గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్సలో భాగంగా ఆమె పొత్తికడుపులోని లింఫ్ గ్రంథులను తొలగించాల్సి వచ్చింది. అయితే వైద్యులు గర్భాశయ ముఖద్వారంలో కొంత భాగాన్నికాపాడటంతో తల్లి అయ్యే అవకాశం దక్కింది. ఏడాది తర్వాత ఆమెకు ఐవీ అనే కుమార్తె జన్మించింది.ఆ పాపకు 'మార్వెల్లా' అనే పేరు పెట్టారు. దానికి అర్థం 'అద్భుతం'. హెచ్‌పీవీ టీకా తనకు అందుబాటులో ఉండి ఉంటే ఇంతటి కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని ఆమె చెప్పింది. తన కుమార్తెకు సరైన వయసు వచ్చిన వెంటనే ఈ టీకా వేయిస్తానని వెల్లడించింది.
వివరాలు
ఇంకా తగ్గనున్న మరణాలు
హెచ్‌పీవీ టీకా తీసుకున్న తరం వయసు పెరుగుతున్న కొద్దీ గర్భాశయ క్యాన్సర్ మరణాలు మరింత తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ అధ్యయనానికి నిధులు సమకూర్చిన క్యాన్సర్ రీసెర్చ్ యూకే సంస్థ దీనిని వైద్యరంగంలో కీలక మైలురాయిగా అభివర్ణించింది. అయితే ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం టీకా తీసుకునే వారి సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని ఆందోళన వ్యక్తం చేసింది. 2024-25 నాటికి 15 ఏళ్లలోపు బాలికల్లో కేవలం 76 శాతం మందికే హెచ్‌పీవీ టీకా అందగా, గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన కోసం కనీసం 90 శాతం టీకా కవరేజీ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.
వివరాలు
అబ్బాయిలకు హెచ్‌పీవీ టీకా
2019 నుంచి అబ్బాయిలకు హెచ్‌పీవీ టీకా ఇస్తున్నారు. దీని వల్ల గొంతు, నోరు, మలద్వారం, పురుషాంగ క్యాన్సర్ల నుంచి రక్షణ లభించడంతో పాటు వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం కూడా తగ్గుతుంది. టీకా తీసుకున్నప్పటికీ 25 నుంచి 64 ఏళ్ల వయసు మహిళలు క్రమం తప్పకుండా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్‌ను ప్రజారోగ్య సమస్యగా 2040 నాటికి నిర్మూలించాలనే లక్ష్యంతో బ్రిటన్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టీకాపై అవగాహన పెంచడంతో పాటు స్క్రీనింగ్‌కు రాని మహిళలకు స్వీయ పరీక్ష కిట్లను కూడా అందిస్తోంది.