Gynecologic Cancer: గైనిక్ క్యాన్సర్ చికిత్సలో ఆస్ట్రేలియా పరిశోధకుల సరికొత్త అధ్యయనం
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల్లో గైనికల్ (స్త్రీల సంబంధ) క్యాన్సర్‌ల చికిత్సలో కొత్త అధ్యయనం మంచి ఆశాజనక ఫలితాలను చూపింది. ఆస్ట్రేలియా పరిశోధకులు తొలిసారిగా రేడియేషన్ చికిత్స సమయంలో క్యాన్సర్ కణితికి (ట్యూమర్), సమీప ఆరోగ్యకరమైన అవయవాల మధ్య దూరాన్ని పెంచడానికి 'స్టెబిలైజ్డ్ హయలురోనిక్ యాసిడ్ (sHA)' అనే ప్రత్యేక జెల్ వాడటం సురక్షితమని, సాధ్యమని నిరూపించారు. ఈ విధానం ద్వారా రేడియేషన్ ప్రభావం ఆరోగ్యకరమైన కణజాలం పై తక్కువగా పడుతుంది, చికిత్స సామర్థ్యం పెరుగుతుంది అని వారు తెలిపారు.
వివరాలు
ఈ విధానం సురక్షితమని, రోగులకు అసౌకర్యం కలగలేదని పరిశోధనలో వెల్లడి
మోనాష్ యూనివర్సిటీ నిపుణుల బృందం ఈ పరిశోధనను నిర్వహించింది. అంతర్గత రేడియేషన్ (బ్రాకీథెరపీ) సమయంలో, క్యాన్సర్ కణితికి,రెక్టమ్ (పురీషనాళం) మధ్య ఈ జెల్ ద్వారా ఖాళీని సృష్టించారు. ఫలితంగా రెక్టమ్ పై రేడియేషన్ ప్రభావం తగ్గి, కణితిపై ఎక్కువ మోతాదులో రేడియేషన్‌ను సరిగ్గా అందించవచ్చు. 12 మంది రోగులపై జరిపిన అధ్యయనంలో, జెల్ ఉపయోగం సులభమని, ఎంఆర్ఐ స్కాన్‌లలో స్పష్టంగా కనిపించిందని వైద్యులు పేర్కొన్నారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం లేదా ప్రతికూల ప్రభావాలు లేవని వారు తెలిపారు.
వివరాలు
'జర్నల్ ఆఫ్ మెడికల్ రేడియేషన్ సైన్సెస్'లో అధ్యయన ఫలితాలు
ఈ జెల్ వాడకం కొత్తేమీ కాదు.ఇప్పటికే ఆస్ట్రేలియాలో ప్రోస్టేట్ క్యాన్సర్ రేడియేషన్ చికిత్సలో దీన్ని ఉపయోగించే విధానం ఆమోదించబడింది. శరీరంలో ప్రవేశపెట్టిన తర్వాత, కాలక్రమేణా ఇది సురక్షితంగా కరిగిపోతుంది. డాక్టర్ కార్మినియా లాపుజ్, పరిశోధన బృందం నేతృత్వంలో, "గైనికల్ క్యాన్సర్‌లలో sHA జెల్ సామర్థ్యాన్ని పరిశీలించడం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అధ్యయనం. ఫలితాలు దీని సురక్షితతను నిరూపిస్తున్నాయి. దీని ద్వారా మరింత ప్రభావవంతమైన చికిత్సలకు మార్గం సుగమం అవుతుంది" అని తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు 'జర్నల్ ఆఫ్ మెడికల్ రేడియేషన్ సైన్సెస్'లో ప్రచురితమయ్యాయి.