Page Loader
Pacemaker: పేస్‌మేకర్‌లో బ్యాటరీ లేకుండా 'ఫ్యూయల్‌ సెల్‌' .. బిట్స్‌ హైదరాబాద్‌ పరిశోధకుల బృందం రూపకల్పన
పేస్‌మేకర్‌లో బ్యాటరీ లేకుండా 'ఫ్యూయల్‌ సెల్‌'

Pacemaker: పేస్‌మేకర్‌లో బ్యాటరీ లేకుండా 'ఫ్యూయల్‌ సెల్‌' .. బిట్స్‌ హైదరాబాద్‌ పరిశోధకుల బృందం రూపకల్పన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2024
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

బిట్స్‌ హైదరాబాద్‌ పరిశోధకుల బృందం హృద్రోగ సమస్యను అధిగమించేందుకు పేస్‌మేకర్‌ అమర్చుకున్న వారి కోసం ప్రత్యేకంగా బ్యాటరీ అవసరం లేని 'ఫ్యూయల్‌ సెల్‌'ను రూపొందించింది. సాధారణంగా పేస్‌మేకర్‌ పనిచేయడానికి లిథియం అయాన్‌ బ్యాటరీలు అవసరం అవుతాయి. అయితే వీటి తయారీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ ఖర్చును తగ్గించేందుకు, బ్యాటరీలు లేకుండా పనిచేసేలా ఎలక్ట్రో కార్బన్‌ వస్త్రంతో తయారుచేసిన 'ఫ్యూయల్‌ సెల్‌'ను ప్రొఫెసర్‌ సంకేత్‌ గోయల్, పరిశోధక విద్యార్థి వన్మతి రూపొందించారు. ఈ సెల్‌ తయారీకి ఖర్చు రూ.100 లోపే ఉంటుందని వారు తెలియజేశారు. ఈ పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ జర్నల్‌ 'మైక్రో మెకానిక్స్, మైక్రో ఇంజినీరింగ్‌' ఇటీవలే ప్రచురించింది.

వివరాలు 

ఇది పనిచేస్తుందిలా..

పేస్‌మేకర్‌లో బ్యాటరీకి బదులుగా ఈ ఫ్యూయల్‌ సెల్‌ను అమర్చడం ద్వారా, గుండె పరిసర ప్రాంతాల్లో రక్తప్రసరణ ద్వారా ఉత్పన్నమయ్యే శక్తితో ఇది 60 నుంచి 90 రోజుల వరకు పనిచేస్తుంది. ఈ విధానం, జంతువులపై నిర్వహించిన ప్రయోగాల్లో సఫలీకృతమైంది. 90 రోజులు గడిచిన తర్వాత పేస్‌మేకర్‌ను తీసి, మరొక ఫ్యూయల్‌ సెల్‌ను అమర్చినట్టు వన్మతి చెప్పారు. పేస్‌మేకర్‌ను శరీరంలో స్థిరంగా అమర్చే బదులు, దీనిని ఎప్పటికప్పుడు బయటకు తీసి మళ్లీ అమర్చే సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇంకా పరిశోధనలు చేయాలని నిర్ణయించారు.