Exoplanets: గ్రహాలు సొంతంగా నీటిని సృష్టించుకోగలవని తేల్చిన కొత్త అధ్యయనం
ఈ వార్తాకథనం ఏంటి
విశ్వంలోని ఇతర గ్రహాలపై నీరు ఎలా ఉత్పత్తి అవుతుందనే దీర్ఘకాలిక ప్రశ్నకు తాజా అధ్యయనం కొత్త సమాధానం చూపించింది. ఇప్పటివరకు ఉన్న సిద్ధాంతాలను తలకిందులు చేస్తూ,ఈ పరిశోధన ప్రకారం నక్షత్రాలకు దగ్గరగా ఉన్న గ్రహాలే తమ అంతర్గత రసాయనిక చర్యల ద్వారా స్వయంగా నీటిని, చివరికి విశాలమైన సముద్రాలను కూడా సృష్టించుకోగలవని తేలింది. ఈ కొత్త అవగాహన జీవం కోసం అనుకూలమైన గ్రహాల అన్వేషణలో విప్లవాత్మక మార్పుకు దారితీస్తోంది.
వివరాలు
పాత సిద్ధాంతాలకు సవాల్
ఇంతవరకు శాస్త్రవేత్తలు, నీటి సమృద్ధిగా ఉన్న గ్రహాలు తమ నక్షత్రాల నుంచి చాలా దూరంలో.. తక్కువ ఉష్ణోగ్రతలున్న "స్నో లైన్" దాటి — ఏర్పడతాయని నమ్మారు. అక్కడ నీరు మంచు రూపంలో ఉండి, ఆ గ్రహాలు తరువాత క్రమంగా తమ నక్షత్రాలవైపు కదిలి వస్తాయని భావించారు. అయితే, తాజా పరిశోధన చెబుతోంది. నక్షత్రానికి సమీపంలోనే పుట్టిన పొడి గ్రహాలు కూడా, కాలక్రమేణా అంతర్గత చర్యల ద్వారా నీటిని సృష్టించి, తడి గ్రహాలుగా మారగలవు.
వివరాలు
నీరు ఎలా ఏర్పడుతుంది?
ఈ అధ్యయనం భూమి నుంచి నెప్ట్యూన్ పరిమాణం మధ్య ఉండే సబ్-నెప్ట్యూన్ గ్రహాలపై కేంద్రీకృతమైంది. వీటికి హైడ్రోజన్ ప్రధానమైన గట్టి వాతావరణం ఉంటుంది. గ్రహం లోపలి లోతుల్లో ఉన్న అధిక పీడనం, ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోజన్, ద్రవరూపంలో ఉన్న సిలికేట్ రాళ్లతో రసాయనికంగా ప్రతిచర్య చేసి నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో రాళ్ల నుంచి ఆక్సిజన్ విడుదలై, అది హైడ్రోజన్‌తో కలిసి నీరుగా మారుతుంది. ఈ మార్పు ద్వారా గ్రహం మొత్తం బరువులో దాదాపు 10 శాతం వరకు నీరు ఏర్పడే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ నీరు, హైడ్రోజన్ వాతావరణం కింద ఉన్న లోతైన సముద్రాల రూపంలో నిల్వవుంటుంది.
వివరాలు
ప్రయోగాత్మక ధృవీకరణ
కాలక్రమేణా నక్షత్ర కిరణాల ప్రభావంతో ఆ హైడ్రోజన్ వాతావరణం ఆవిరైపోతే, ఆ గ్రహాలు "సూపర్ ఎర్త్‌లు" లేదా "హైసియన్ గ్రహాలు"గా పరిణమిస్తాయి. అంటే, హైడ్రోజన్ గ్రహాలు,నీటి గ్రహాలు వేర్వేరు కాదు.. ఒకే పరిణామ క్రమంలో భాగమని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఈ కొత్త సిద్ధాంతాన్ని నిరూపించడానికి, శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లోనే గ్రహాల అంతర్గత పరిస్థితులను సృష్టించారు. డైమండ్-అన్విల్ సెల్, పల్స్‌డ్ లేజర్ హీటింగ్ సాంకేతికతల సహాయంతో అత్యధిక పీడనం, ఉష్ణోగ్రతలను అనుకరించారు. ఆ పరిస్థితుల్లో హైడ్రోజన్ , సిలికేట్ ఖనిజాల మధ్య జరిగే రసాయన చర్యలను ఎక్స్-రే డిఫ్రాక్షన్, రామన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా విశ్లేషించి, నీటి నిర్మాణం నిజంగా జరిగిందని నిర్ధారించారు.
వివరాలు
భవిష్యత్తు పరిశోధనల దిశ
ఈ కనుగొనుగోలు, జీవం ఉండే గ్రహాల అన్వేషణకు కొత్త పరిమాణాన్ని తెరలేపింది. ఇకపై శాస్త్రవేత్తలు నక్షత్రాలకు దూరంగా ఉన్న గ్రహాలకే కాదు, దగ్గరగా ఉన్న వాటిపైనా జీవనచిహ్నాల కోసం పరిశీలన చేయవచ్చు. భవిష్యత్తులో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) వంటి ఆధునిక పరికరాలతో బాహ్య గ్రహాల వాతావరణాలను గమనించి, నీటి ఆవిరి, హైడ్రోజన్, సిలికాన్ హైడ్రైడ్‌ల ఉనికిని గుర్తించడం ద్వారా ఈ సిద్ధాంతాన్ని మరింత బలపరచే అవకాశముంది. ఈ పరిశోధన ఫలితాలు ప్రపంచప్రసిద్ధ 'నేచర్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.